6 లేన్లుగా హైదరాబాద్–విజయవాడ హైవే
65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణతో పాటు సమయం వృథా కాకుండా ప్రయాణించేందుకు వీలుగా రహదారిని నిర్మించనున్నట్టు వివరించారు.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా మార్చేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లోనే చేరుకునేలా 65వ నంబర్ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా మార్చేందుకు రూ.16 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు.
త్వరలో ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నట్టు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణతో పాటు సమయం వృథా కాకుండా ప్రయాణించేందుకు వీలుగా రహదారిని నిర్మించనున్నట్టు వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి మార్కాపురం వరకు ఆరు లేన్ల రహదారి విస్తరణ పనులు పూర్తి కావచ్చాయని ఆయన చెప్పారు. రూ.35 వేల కోట్లతో హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు తగిన ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. చిట్యాల నుంచి భువనగిరి వరకు నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించేందుకు కూడా ప్రతిపాదనలు చేసినట్టు వివరించారు.