సొమ్ము రాష్ట్రాలది, సోకు కేంద్రానిది.. అసెంబ్లీలో హాట్ డిస్కషన్
15వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.6,268 కోట్లు ఇవ్వాలని సూచించినా కేంద్రానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు హరీష్ రావు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 817 కోట్ల రూపాయలు కూడా ఇంకా రాలేదని చెప్పారు.
బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు. ఇదీ బీజేపీ మౌలిక సిద్ధాంతం అంటూ తెలంగాణ అసెంబ్లీలో ధ్వజమెత్తారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఎనిమిదేళ్ల తెలంగాణ ప్రభుత్వ పరిపాలన సారాంశం.. సఫలం-సంక్షేమం-సామరస్యం కాగా.. ఎనిమిదేశ్ల మోదీ పాలన సారాంశం.. విఫలం-విషం-విద్వేషం అని దుయ్యబట్టారు. రాష్ట్రం సొమ్ములతో సోకులు చేసుకుంటున్న కేంద్రం.. ఆ రాష్ట్రాలకు నిధుల్లో వాటా విడుదల చేయడంలేదని, అభివృద్ధికి సహకరించడంలేదని, ఆంక్షలతో అష్టకష్టాలు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
మీకో రూలు, మాకో రూలా..
అప్పులు తీసుకోవడంలో తెలంగాణకు ఓ రూలు, కేంద్రానికి మరో రూలా అని నిలదీశారు మంత్రి హరీష్ రావు. ఎఫ్ఆర్బీఎం చట్టం అమలులో కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని అన్నారు. కేంద్రం పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుంటున్నా, వాటిని రికవరీలో పెట్టలేదు, రాష్ట్రాలు అప్పులు చేస్తే మాత్రం రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో రికవరీ చేస్తమని అనడం, అప్పుల పరిమితి తగ్గించాలని చూడటం సరికాదన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో 4శాతం ఎఫ్ఆర్బీఎం అనుమతి ఉండగా.. రైతులకోసం రాష్ట్ర ప్రభుత్వం అరశాతం కోల్పోయిందని చెప్పారు మంత్రి హరీష్ రావు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో కేంద్రం అరశాతం కోత విధించిందని చెప్పారు. దాని విలువ అక్షరాలా 6104 కోట్ల రూపాయలని వివరించారు. బడ్జెట్ తర్వాత దానిలో కోత పెడతామంటూ కేంద్రం ప్రకటించడం దారుణం అని చెప్పారు హరీష్ రావు.
ఆర్థిక సంఘం సిఫారసులు బుట్ట దాఖలు..
15వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.6,268 కోట్లు ఇవ్వాలని సూచించినా కేంద్రానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు హరీష్ రావు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 817 కోట్ల రూపాయలు కూడా ఇంకా రాలేదని చెప్పారు. మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయకు 5వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కుదరదు పొమ్మన్నారని, ఇలాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదని అన్నారు హరీష్ రావు. రాష్ట్రానికి పన్నుల వాటా 42 శాతం రావాల్సి ఉన్నా.. కేవలం 29.6శాతం మాత్రమే ఇస్తున్నారని, దీని వల్ల 33712 కోట్ల రూపాయలు నష్టపోతున్నామని వివరించారు.
తెలంగాణ నుంచి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేశామని, దశాబ్దాల సమస్యను కేసీఆర్ సర్కారు పరిష్కరించిందని గుర్తు చేశారు హరీష్ రావు. కాళేశ్వరం, మిషన్ భగీరథపై పెట్టిన ఖర్చు వృథా కాలేదని, అది ఆదాయం పెంచుకునే మార్గమని చెప్పారాయన. అప్పులు పెరగడం కాదు, తెలంగాణ ఆదాయం పెరిగిందని వివరించారు.
తెలంగాణ వృద్ధి గణాంకాలు..
- పన్నుల ద్వారా వచ్చిన రాబడిలో సగటున 11.5 వృద్దితో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
- రాష్ట్ర విభజన రోజు తెలంగాణ జీడీపీ 4 శాతం కాగా, ఇప్పుడది 4.9 శాతం
- దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.9శాతం, దేశ జీడీపీలో వాటా 4.9శాతం
- 2013-14లో తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు.. 2021-22లో 2,75,443 రూపాయలు
- అభివృద్ధి చెందిన దేశాల విషయానికొస్తే జపాన్ డెట్ జీఎస్డీపీ 201 శాతం, సింగపూర్ 155 శాతం, అమెరికా 119 శాతం, భారత్ 55శాతం, తెలంగాణ డెట్ జీఎస్డీపీ కేవలం 23.5 శాతం
పన్నుల్లో వాటా లెక్కలు..
రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఇచ్చింది రూ.3,65,797 కోట్లు
కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది రూ.1,96,448 కోట్లు.
ప్రతి రూపాయిలో 47 పైసలు తెలంగాణ దేశానికి ఇస్తోంది..
తెలంగాణకు రావాల్సిన బకాయిలు..
ఎఫ్ఆర్బీఎం లో కోతల వల్ల నిలిచిపోయిన సొమ్ము రూ.15033 కోట్లు
విద్యుత్ సంస్కరణల కారణంగా నిలిచిపోయిన నిధులు రూ.6,104 కోట్లు
15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రూ.5,374 కోట్లు
14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రూ.817 కోట్లు
పన్నుల్లో 41శాతం వాటాగా రూ.33,712 కోట్లు
ఏపీ నుంచి విద్యుత్ బకాయిలు రూ.17,828 కోట్లు
ఏపీనుంచి రావాల్సిన సీఎస్ఎస్ బకాయిలు రూ.495 కోట్లు
స్పెషల్ అసిస్టెంట్ గ్రాంట్ కింద రూ.1350 కోట్లు
మిషన్ భగీరథకు రూ.19205 కోట్లు
మిషన్ కాకతీయకు రూ.5000 కోట్లు
అంతా కలిపితే తెలంగాకు రావాల్సిన డబ్బు 1,05,812 కోట్లు రూపాయలు
ఇక కేంద్రం చేసిన తప్పులకు రాష్ట్రాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అన్నారు మంత్రి హరీష్ రావు. 2014 వరకు డాలర్ తో రూపాయి మారక విలువ రూ.59.7 ఉంటే... ఇప్పుడది రూ.80కి పడిపోయింది. దీనవల్ల పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిపోయిందని చెప్పారు హరీష్ రావు. భారత్ లో 26శాతం నిరుద్యోగిత ఉందని, ప్రపంచంలో ఏ ఇతర దేశంతో పోల్చి చూసినా భారత్ లో పరిస్థితి దుర్భరంగా ఉందని అన్నారాయన. సుస్థిరాభివృద్ధిలో 120వ స్థానం, గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో 135వ స్థానంలో ఉన్నామని, దేశంలో అశాంతి, అలజడి రాజ్యమేలుతున్నాయని చెప్పారు. పెద్దనోట్ల రద్దు, అర్హులందరికీ ఇళ్లు, మేకిన్ ఇండియా, నమామి గంగే, నధుల అనుసంధానం.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిట్లోనూ మోదీ ఫెయిలయ్యారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం మరింత తెలివి తక్కువ పని అని చెప్పారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్నారని మండిపడ్డారు. పొలాలకు నీళ్లు పారించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం పరితపిస్తుంటే, మత ఘర్షణలతో తలలు పగిలి నెత్తురు పారాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పచ్చని పంటల తెలంగాణ కావాలా, మత పిచ్చి మంటల తెలంగాణ కావాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.