సద్ది తిన్న రేవు తలవాలి.. బీఆర్ఎస్ ని ఆశీర్వదించాలి
రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని, రాష్ట్ర ఆదాయంలోని ప్రతి రూపాయిని పేద ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామని చెప్పారు హరీష్ రావు.
సద్దితిన్న రేవు తలవాలని ప్రజలకు సూచించారు మంత్రి హరీష్ రావు. అందుకే పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. సిద్ధిపేటలో పర్యటించిన ఆయన రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని చెప్పారు. అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు అందని ఎత్తులో తెలంగాణ ఉందని, దానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ గెలుపు అనివార్యం అని చెప్పారు.
సిద్దిపేటలో వెంకటాపూర్, ఇబ్రహీంపూర్, గుర్రాలగొంది గ్రామాల్లో పర్యటించారు మంత్రి హరీష్ రావు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమైన సందర్భంలో లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. సిద్ధిపేట రూరల్, నారాయణరావుపేట మండలాల్లో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. తెలంగాణలో దాదాపు అన్ని కుటుంబాలు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల లబ్ధిపొందాయని చెప్పుకొచ్చారు మంత్రి హరీష్ రావు.
తేడా చూడండి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో, తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వచ్చిందో ప్రజలు గమనించాలని చెప్పారు మంత్రి హరీష్ రావు. పన్నుల రాబడుల్లో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉందని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 2022-23 సంవత్సరంలో రూ.72, 564 కోట్లు వచ్చాయని చెప్పారు. దేశంలోనే అభివృద్ధికి సూచికగా తెలంగాణను సీఎం కేసీఆర్ నిలబెట్టారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని, రాష్ట్ర ఆదాయంలోని ప్రతి రూపాయిని పేద ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామని చెప్పారు హరీష్ రావు.