ఫిబ్రవరిలో తెలంగాణ మెగా డీఎస్సీ..
ఇప్పటికే డీఎస్సీ కోసం ఎదురు చూసి, చివరిగా ఎన్నికల కారణంగా నిరాశలోకి వెళ్లిన ఆశావహులు.. ఫిబ్రవరిలో పరీక్షలకోసం ప్రిపరేషన్ మొదలు పెట్టొచ్చనమాట.
తెలంగాణలో డీఎస్సీ పరీక్షను ఫిబ్రవరిలో నిర్వహిస్తామని ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. UPSC తరహాలో గ్రూప్స్ పరీక్షలని నిర్వహిస్తామని, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామని చెప్పారు. మంత్రి ప్రకటన తెలంగాణలో డీఎస్సీకోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిజంగా శుభవార్త అని చెప్పాలి. ఇప్పటికే డీఎస్సీకోసం ఎదురు చూసి, చివరిగా ఎన్నికల కారణంగా నిరాశలోకి వెళ్లిన ఆశావహులు.. ఫిబ్రవరిలో పరీక్షలకోసం ప్రిపరేషన్ మొదలు పెట్టొచ్చనమాట.
గత ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన తెలంగాణ డీఎస్సీ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. 5,089 టీచర్ల పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అనుమతిచ్చింది. నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల ఫలితాలు విడుదలై తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత దీనిపై ఇంకా అప్ డేట్ రాలేదు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు.
నల్లగొండ పట్టణంలో మున్సిపల్ రోడ్ల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆర్డీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నల్లగొండ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరలోనే మొదలు పెడతామన్నారు. ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారులకి సంక్షేమ ఫలాలను అందిస్తామని తెలిపారు. అన్ని గ్యారెంటీలను 100 శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు కోమటిరెడ్డి.