Telugu Global
Telangana

డయాలసిస్ పేషెంట్లకు జీవితాంతం పెన్షన్ : మంత్రి హరీశ్ రావు

ప్రస్తుతం రాష్ట్రంలో 5,000 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

డయాలసిస్ పేషెంట్లకు జీవితాంతం పెన్షన్ : మంత్రి హరీశ్ రావు
X

తెలంగాణలో డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ పేషెంట్లకు జీవితాంతం ఆసరా పెన్షన్ ఇస్తున్నామని, వారికి బస్ పాస్ కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ అందుబాటులోకి తెచ్చామని, దేశంలోనే తొలి సారిగా ఈ పద్దతిని ఉపయోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకు ఎక్కిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,000 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారని, వారిలో 10,000 మందికి ప్రభుత్వమే ఉచితంగా డయాలసిస్ చేయిస్తోందని మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 5,000 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకమునుపు తెలంగాన పరిధిలో కేవలం 3 ఆసుపత్రుల్లోనే డయాలసిస్ సేవలు ఉండేవి, కానీ ఇప్పుడు 83 ఆసుపత్రుల్లో డయాలసిస్ అందుబాటులోకి వచ్చిందన్నారు. త్వరలోనే వీటి సంఖ్య 103కు చేరుతుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రూ. 700 కోట్లు కిడ్నీ రోగుల కోసం ఖర్చు చేసినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.

మన రాష్ట్రంలో ఏటా 150 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని హరీశ్ రావు చెప్పారు. ఈ ఆపరేషన్ తర్వాత అవసరమయ్యే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో ప్రతీ నెల 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయని చెప్పారు. ఇందుకోసం నెలకు రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

ఇప్పుడు అందరూ మెంటల్ హెల్త్ గురించి కూడా పట్టించుకోవల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో మానసిక సమస్యలతో బాధపడే వారి కోసం టెలీ మెంటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి చెప్పారు. ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో ఈ కేంద్రం నడుస్తోందన్నారు. 14416 నెంబర్‌కు కాల్ చేసి ఎవరైనా తమ సమస్యను చెప్పుకోవచ్చని అన్నారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు.

First Published:  11 Oct 2022 5:26 PM IST
Next Story