Telugu Global
Telangana

కమ్మ సంఘం కేసీఆర్‌ను బెదిరిస్తోందా?

తమ జనాభాకు తగ్గట్లుగా, తుమ్మలకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తగిన ప్రతిఫలం అనుభవిస్తుందన్నట్లుగా శాపనార్థాలు పెట్టడమే విచిత్రంగా ఉంది.

కమ్మ సంఘం కేసీఆర్‌ను బెదిరిస్తోందా?
X

తెలంగాణ కమ్మ సంఘం వైఖరి చాలా విచిత్రంగా ఉంది. కమ్మ సంఘం నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. సామాజికవర్గం జనాభా దామాషా ప్రకారం తమకు 10 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంటు స్థానాల్లో టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తమ సామాజికవర్గం ఆర్థికంగానే కాకుండా అనేక రంగాల్లో చాలా బలంగా ఉందని చెప్పారు. కనీసం తమ సామాజికవర్గానికి 45 నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించేంత శక్తి ఉందని చెప్పింది.

తమ సామాజికవర్గం జనాభా 5 శాతం ఉందని ఇతర సామాజికవర్గాలను కూడా ప్రభావితం చేయగలిగిన స్థితిలో ఉందని రేవంత్, కిషన్‌కు ఇచ్చిన విజ్ఞప్తుల్లో స్పష్టంగా చెప్పింది. బీఆర్ఎస్ తమ సామాజికవర్గానికి కేవలం 5 ఎమ్మెల్యే టికెట్లను మాత్రమే ఇచ్చిందని చెప్పటమే విచిత్రంగా ఉంది. అసలు ఇదంతా కమ్మ సంఘం ఎందుకు చెప్పిందంటే ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వనందుకే.

తమ జనాభాకు తగ్గట్లుగా, తుమ్మలకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తగిన ప్రతిఫలం అనుభవిస్తుందన్నట్లుగా శాపనార్థాలు పెట్టడమే విచిత్రంగా ఉంది. తుమ్మలకు టికెట్ ఇవ్వకపోతే మొత్తం కమ్మ సామాజికవర్గానికి అన్యాయం చేసినట్లేనా? గెలుపోటములపై సర్వే చేయించుకునే కేసీఆర్‌ టికెట్లు ఇస్తానని చాలాసార్లు చెప్పారు. ఒక్కోసారి సర్వే రిపోర్టులు కూడా తప్పచ్చు. అయితే అంతమాత్రాన కేసీఆర్‌ను కమ్మ సంఘం బెదిరించటమే ఆశ్చర్యంగా ఉంది.

రేవంత్, కిషన్‌ను కలిసిన కమ్మ సంఘం ప్రతినిధులు కేసీఆర్‌ను మాత్రం కలవలేదు. పాలేరులో తుమ్మలకు టికెట్ ఇవ్వకపోతే చాలా ఘోరం జరిగిపోతుందని, కమ్మ సామాజిక‌వ‌ర్గం ఓట్లు బీఆర్ఎస్‌కు పడవన్నట్లుగా మాట్లాడుతున్నారు. మరి తుమ్మల గతంలో కూడా ఓడిపోయారు, గెలిచారు. గెలుపోటములతో సంబంధం లేకుండా కమ్మ సామాజికవర్గానికి ఏమిచేశారన్నదే కీలకమైన పాయింట్. పైగా తుమ్మల మొత్తం సామాజికవర్గానికి పెద్దదిక్కు కూడా ఏమీకాదు. ఇవన్నీ చూసుకునే ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి కట్ చేయాలనే విషయాన్ని కేసీఆర్‌ డిసైడ్ చేసుకునుంటారనటంలో సందేహంలేదు. అలాంటిది వీళ్ళ బెదరింపులకు కేసీఆర్‌ బెదురుతారా?


First Published:  26 Aug 2023 11:32 AM IST
Next Story