జూనియర్ డాక్టర్ల సమ్మె తాత్కాలిక విరమణ
ప్రభుత్వం గతంలో లాగా హామీలిస్తే సమ్మె విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు ఓ దశలో ఆందోళన చేపట్టారు. ఈసారి ప్రభుత్వం తమ అంగీకారం తెలపడంతోపాటు వెంటనే జీఓలు కూడా విడుదల చేసింది.
సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ప్రకటించారు తెలంగాణ జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తాత్కాలికంగా సమ్మెకు విరామం ఇస్తున్నట్టు తెలిపారు. పూర్తి స్థాయిలో తమ డిమాండ్లు నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
జీఓలు జారీ..
జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండు జీఓలు జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల వసతిగృహాల నిర్మాణానికి జీఓ విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ మరో జీఓ ఇచ్చారు అధికారులు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో పాటు కాకతీయ వర్శిటీకి రూ.204.85 కోట్లు కేటాయించగా, ఉస్మానియాలో హాస్టల్ భవనాలు, రోడ్లకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆస్పత్రికి రూ.79.50 కోట్లు, కాకతీయ వర్శిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా జీఓల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వం గతంలో లాగా హామీలిస్తే సమ్మె విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు ఓ దశలో ఆందోళన చేపట్టారు. ఈసారి ప్రభుత్వం తమ అంగీకారం తెలపడంతోపాటు వెంటనే జీఓలు కూడా విడుదల చేసింది. దీతో జూనియర్ డాక్టర్లు శాంతించారు. జీఓల విడుదలతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. విధులకు హాజరయ్యారు.