ఢిల్లీలో పనిచేస్తున్నా, హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు..
ఢిల్లీలో పనిచేస్తున్నా సరే, తెలంగాణ జర్నలిస్ట్ లకు హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
వివిధ మీడియా సంస్థల తరపున ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్ట్ లకు శుభవార్త చెప్పారు. ఢిల్లీలో పనిచేస్తున్నా కూడా వారందరికీ హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. ఈమేరకు తనను కలసిన జర్నలిస్ట్ సంఘాల నేతలకు ఆయన హామీ ఇచ్చారు. ఆ ప్రక్రియను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు అప్పగించామని తెలిపారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ని తెలంగాణ జర్నలిస్ట్ లు ప్రత్యేకంగా కలిశారు. జీవనోపాధికోసం ఢిల్లీకి వచ్చి పనిచేస్తున్నామని, సొంత రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో తమకు అన్యాయం చేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించారు మంత్రి కేటీఆర్. ఢిల్లీలో పనిచేస్తున్నా సరే, తెలంగాణ జర్నలిస్ట్ లకు హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్ట్ లకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వారికి మరోసారి వివరించారు.
ఢిల్లీలో మంత్రి కేటీఆర్ ను టీయూడబ్ల్యూజే–143 సంఘం సభ్యులు కలసి మెమొరాండం సమర్పించారు. తెలంగాణలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు. తమకు కూడా న్యాయం చేయాలని కోరారు. ఢిల్లీలో పనిచేస్తున్న వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జీవోలో ఆయా అంశాలను పొందుపరుస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి, హైదరాబాద్ పాత్రికేయులకు ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు.