కాళేశ్వరానికి లక్ష జన హారతి
ఒకప్పుడు కరువు ప్రాంతమైన సూర్యాపేట నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమైందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సబ్బండ వర్గాలకు జీవనోపాధి లభిస్తుందని చెప్పారు.
భూముల ధరలకు రెక్కలు వచ్చి రైతులు కోటీశ్వరులు అయ్యారని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 7 న సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఎస్సారెస్పీ కాలువ పొడవునా కేసీఆర్‌కు కృతజ్ఞతలతో కాళేశ్వర జలానికి లక్ష జన హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ప్రజలు లక్షలాదిగా రైతుకు తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ఊరు నుంచి రైతులు తరలి వచ్చి, గోదావరి జలాలకు పుష్పార్చన, వంటా, వార్పులో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం ఇస్తాలపురం గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం 40 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, పాఠశాల ప్రహరీ నిర్మాణాల వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సూర్యాపేట పట్టణం ఒకటో వార్డ్ పరిధిలోని బురకపిట్ట తండాలో బొడ్రాయి పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే ఆలయాలు, బొడ్రాయి పండుగ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారని అన్నారు. సూర్యాపేట జిల్లాలో ఇటీవల ఎక్కడా చూసినా, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.