ఐటీలో తెలంగాణ మేటి.. కానీ..! కాంగ్రెస్ కవరింగ్ కష్టాలు
పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అత్యంత అనుకూల ప్రదేశం అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 1990వ దశకంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమకు పునాదులు వేశారని, తాము పరిశ్రమ అభివృద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఐటీరంగంలో తెలంగాణ మేటి అనే విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది, కాంగ్రెస్ కూడా దీన్ని కాదనలేదు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఐటీ రంగం విషయంలో ఆచితూచి మాట్లాడుతోంది. ఐటీలో, పరిశ్రమల అభివృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది కానీ, ఆ ఘనత బీఆర్ఎస్ ది మాత్రం కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. ఇటీవల దావోస్ సదస్సులో కూడా కాంగ్రెస్ నేతలు కవరింగ్ కష్టాలు పడ్డారు. తాజాగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఘనత చెప్పాల్సి వస్తుందేమోనని ఆయన కంగారు పడ్డారు.
హైదరాబాద్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) హెడ్ క్వార్టర్స్‌గా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు. యువతలో నైపుణ్యాలు పెంపొందించి పరిశ్రమలకు సంసిద్ధంగా తీర్చిదిద్దేందుకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు టాటా, మహీంద్రా సంస్థలు ముందుకొచ్చాయన్నారు. హైదరాబాద్ లో టెలి పర్ఫార్మెన్స్ ఇమ్మెర్సివ్ ఎక్స్‌పీరియన్స్ సమ్మిట్ కు హాజరైన ఆయన తెలంగాణ ఐటీ, పరిశ్రమల అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అత్యంత అనుకూల ప్రదేశం అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 1990వ దశకంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమకు పునాదులు వేశారని, తాము పరిశ్రమ అభివృద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపారు. నగరంలో సానుకూల వాతావరణం, మానవ వనరులు, మౌలిక వసతులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 165 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ఐఎస్‌బీ తరహాలో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జూన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గ్లోబల్ సమ్మిట్ ని నగరంలో నిర్వహించబోతున్నట్టు తెలిపారాయన. ప్రపంచవ్యాప్త ఏఐ కంపెనీలను ఈ సదస్సుకి ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. మొత్తమ్మీద హైదరాబాద్ ఐటీ, పరిశ్రమల రంగంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. అదే సమయంలో అది బీఆర్ఎస్ ఘనత అనేందుకు ఆయన మనసు ఒప్పుకోలేదు. కాంగ్రెస్ ప్రధాని పీవీ నరసింహారావు ఘనతను ప్రస్తావించారు కానీ, విభజన తర్వాత తెలంగాణలో ఐటీ, పరిశ్రమల రంగం గణనీయ అభివృద్ధికి కారణం ఎవరో వివరించలేదు.