Telugu Global
Telangana

మత్స్య సంపద వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానం.. నేడు ఉచిత చేప పిల్లల పంపిణీ

ప్రభుత్వం ఈ ఏడాది 26,357 నీటి వనరుల్లో రూ.84.13 కోట్లతో 85.60 కోట్ల చేప పిల్లలను.. 300 నీటి వనరుల్లో రూ.25.99 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తోంది.

మత్స్య సంపద వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానం.. నేడు ఉచిత చేప పిల్లల పంపిణీ
X

మత్స్య సంపద వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో.. రాష్ట్రం ఆవిర్భావానికి ముందు 1.98 లక్షల టన్నుల సంపద ఉండగా.. ప్రస్తుతం మత్స్య సంపద 4.24 లక్షల టన్నులకు పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రం ఈ ఘనతను సాధించిందని తలసాని పేర్కొన్నారు. సముద్ర భూభాగం లేని రాష్ట్రంలో అత్యధిక మత్స్యసంపద ఉండటం గర్వకారణమన్నారు.

కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో చెరువులు, కుంటల్లో ఏడాది పొడవునా నీళ్లు లభ్యమవుతున్నాయి. దీంతో మత్స్య కారులు మెరుగైన ఉపాధి పొందుతున్నారని మంత్రి చెప్పారు. నీటి లభ్యత పెరగడంతో మత్స్య సంపద కూడా పెరిగిందన్నారు.

మత్స్యకారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించినట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. రాష్ట్రంలో లభ్యం అవుతున్న చేపలను తక్కువ ధరలకు దళారులకు అమ్ముకోవద్దని సూచించారు. దళారులకు అమ్మడం వల్ల నష్టాలు వస్తాయి. కాబట్టి నేరుగా మార్కెట్లకు అమ్మాలని.. తద్వారా లాభాలు పొందాలని మంత్రి చెప్పారు.

ఈ ఏడాదికి సంబంధించి ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప, రొయ్య పిల్లలను విడుదల చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

కాగా, ప్రభుత్వం ఈ ఏడాది 26,357 నీటి వనరుల్లో రూ.84.13 కోట్లతో 85.60 కోట్ల చేప పిల్లలను.. 300 నీటి వనరుల్లో రూ.25.99 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తోంది.

*

First Published:  26 Aug 2023 6:37 AM IST
Next Story