అవయవ మార్పిడి, దానంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం : మంత్రి హరీశ్ రావు
13వ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జీవన్‌దాన్ ఆధ్వర్యంలో అవయవ దాతల కుటుంబీకులను మంత్రి ఘనంగా సన్మానించారు.
మరణించినా.. ఈ ప్రపంచంలో మరి కొంతకాలం జీవించి ఉండే అవకాశం కేవలం అవయవ దానం వల్లే సాధ్యమవుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. అవయవ మార్పిడిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని మంత్రి చెప్పారు. 2022లో దేశవ్యాప్తంగా 1,675 ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు జరగ్గా.. అందులో 530 సర్జరీలు తెలంగాణలోనే నిర్వహించినట్లు మంత్రి పేర్కొన్నారు. తమిళనాడులో 519, కర్ణాటకలో 415 సర్జరీలు జరిగినట్లు మంత్రి వెల్లడించారు.
అవయవదానంలో రికార్డు సృష్టించిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అవార్డు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. 13వ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జీవన్‌దాన్ ఆధ్వర్యంలో అవయవ దాతల కుటుంబీకులను మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. అయిన వారిని కోల్పోయామనే బాధలో ఉండి కూడా.. మరొకరికి ప్రాణం పోయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం అన్నారు. ఇలాంటి నిర్ణయం వల్ల ఎంతో మంది తిరిగి ప్రాణాలతో జీవిస్తున్నారు. వీరి నిర్ణయం చాలా స్పూర్తిదాయకం అని మంత్రి చెప్పారు.
అవయవ దానం చేయాలని ఈ కుటుంబాలు తీసుకున్న నిర్ణయం వల్ల నేడు ఎంతో మంది పునర్జన్మ పొందారని.. అందుకు చేతులెత్తి మొక్కుతున్నానని మంత్రి చెప్పారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్లు, డొనేషన్లలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. 2022లో తెలంగాణలో 194 మందిని బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించి.. అవయవదానం చేసినట్లు మంత్రి చెప్పారు. తమిళనాడులో 156, కర్ణాటకలో 151, గుజరాత్‌లో 148 బ్రెయిన్ డెడ్ అవయవ దానాలు జరిగినట్లు మంత్రి చెప్పారు.
అవయవ మార్పిడికి ఒకప్పుడు కేవలం కార్పొరేట్ ఆసుపత్రులే గుర్తుకు వచ్చేవి. కానీ సీఎం కేసీఆర్ కల్పించిన మౌలిక వసతుల కారణంగా.. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రభుత్వ దవఖానల్లో కూడా అవయవ మార్పిడి చికిత్సలు జరుగుతున్నట్లు మంత్రిచెప్పారు. ఇప్పటి వరకు నిమ్స్‌లో 395, ఉస్మానియాలో 74, గాంధీలో 11 ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు జరిగినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 480 సర్జరీలు చేయగా.. అందులో 436 సర్జరీలు కిడ్నీ మార్పిడికి సంబంధించినవి ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.