ప్రపంచ స్థాయి సంస్థలకు తెలంగాణే తొలి ఛాయిస్
టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 20 వేలకుపైగా యూనిట్లకు అనుమతులు ఇచ్చామని, వీటి ద్వారా 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు, 1.6 మిలియన్ల ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చినట్టు చెప్పారు మంత్రి కేటీఆర్.
పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో తెలంగాణలో స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలు అమలులో ఉన్నాయని అన్నారు మంత్రి కేటీఆర్. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ కేంద్రాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడమే దీనికి ఉదాహరణ అని చెప్పారాయన. ఫ్రాన్స్ లోని అతిపెద్ద ఎంప్లాయర్ ఫెడరేషన్ అయిన 'మూమెంట్ ఆఫ్ ది ఎంటర్ ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (మెడెఫ్)' ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ర్టాల్లో పరిశ్రమల స్థాపకులకు ఇన్వర్టర్లు, జనరేటర్లకోసం ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంటే, తెలంగాణలో ఆ సమస్యే లేదన్నారు కేటీఆర్. వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ని సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించిందని అన్నారు.
టీఎస్ ఐపాస్..
టీఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణలో పారిశ్రామిక అనుకూల విధానాలు అమలవుతున్నాయని చెప్పారు కేటీఆర్. ఎక్కడా లేని విధంగా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని వివరించారు. దరఖాస్తు చేసుకున్న15 రోజుల్లోగా అనుమతులు రాకపోతే, అది డీమ్డ్ టు బి అప్రూవ్డ్ కింద పరిగణిస్తున్నామని.. ఆలస్యానికి కారణమైన అధికారులకు జరిమానా విధిస్తున్నామని చెప్పారు. దీనివల్ల అనుమతుల్లో పారదర్శకత, వేగం పెరిగిందని చెప్పారు కేటీఆర్. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 20 వేలకుపైగా యూనిట్లకు అనుమతులు ఇచ్చామని, వీటి ద్వారా 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు, 1.6 మిలియన్ల ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చినట్టు చెప్పారు.
మెరుగైన పారిశ్రామిక విధానాలే కాదు, మౌలిక సదుపాయాల కల్పన, మానవ వనరుల విషయంలో కూడా తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు కేటీఆర్. భారతదేశంలో పెట్టుబడులకోసం వచ్చే కంపెనీలు, ముందుగా తెలంగాణ విధానాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమని చూసి ఇతర రాష్ట్రాలు మెరుగైన ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయని, అలాంటి రాష్ట్రాలతో తామెప్పుడూ పోటీపడతామని, వారికంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని చెప్పారు కేటీఆర్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మెడెఫ్ ప్రతినిధులను ఆయన కోరారు. తెలంగాణ ప్రత్యేకతలు, ఇక్కడ స్థాపించిన ప్రధాన సంస్థలు, రాష్ట్ర చారిత్రక వైభవం గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు.
ఇవీ మా ప్రత్యేకతలు..
శాంతి భద్రతల పర్యవేక్షణకోసం దేశంలోనే అత్యాధునిక ట్విన్ టవర్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించినట్టు చెప్పారు కేటీఆర్. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ టీ-హబ్ ను నిర్మించామన్నారు. ఇక్కడ 2వేల స్టార్టప్స్ అభివృద్ధి చెందాయన్నారు. ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ ISB ఇక్కడే ఉందన్నారు. అమెజాన్ సంస్థ అతిపెద్ద క్యాంపస్ కూడా హైదరాబాద్ లోే ఉందని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నాలుగేళ్లలో నిర్మించామని చెప్పారు. సాగునీటి ప్రాజక్టుల కారణంగా సాగుభూమి రెట్టింపైందని, పంటల దిగుబడి భారీగా పెరిగిందని వివరించారు.