పర్యాటకంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ..
ఇతర రాష్ట్రాలకు కూడా అవార్డులు వచ్చినా, పర్యాటక రంగంలో ఉత్తమ రాష్ట్రంగా ఎంపికవడంతోపాటు మొత్తం 4 అవార్డులతో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది.
భారత పర్యాటక రంగంలో తెలంగాణ తన సత్తా చాటింది. దేశంలోనే ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఎంపికైంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలంగాణను ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా గుర్తిస్తూ అవార్డులు అందించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ చేతుల మీదుగా ఈ అవార్డులను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వీకరించారు.
నాలుగు విభాగాల్లో అవార్డులు..
పర్యాటకంలో సమగ్ర అభివృద్ధి - Best State Comprehensive Development of Tourism
ఉత్తమ గోల్ఫ్ కోర్స్ - Best Golf Course Hyderabad Golf Club
ఉత్తమ రైల్వే స్టేషన్ - Best Railway Station Secunderabad
ఉత్తమ మెడికల్ టూరిజం - Best Medical Toursim Facility Appollo Hospitals in Hyderabad
పర్యాటకంలో సమగ్ర అభివృద్ధి సాధించిన హైదరాబాద్ కరోనా కష్టకాలం తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షించింది. పర్యాటక ప్రాంతాలతోపాటు, ఉత్తమ వసతి సౌకర్యాలు కూడా హైదరాబాద్ లో ఉండటం, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ అత్యుత్తమంగా ఉండటం దీనికి కారణం. అందుకే పర్యాటకంలో సమగ్ర అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది.
ఇక ఉత్తమ గోల్ఫ్ కోర్స్ గా హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఉత్తమ రైల్వే స్టేషన్ అవార్డ్ లు లభించాయి. అపోలో ఆస్పత్రులకు ఉత్తమ మెడికల్ టూరిజం కింద అవార్డులు వరించాయి. దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి వైద్యం కోసం హైదరాబాద్ వచ్చేవారి సంఖ్య అధికం. కరోనా కాలంలో కూడా ఈ విషయం రుజువైంది. మెరుగైన చికిత్సకోసం పొరుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ వైపే చూస్తుంటారు. బెస్ట్ మెడికల్ టూరిజం విభాగంలో కూడా హైదరాబాద్ ఘనత దేశవ్యాప్తంగా నిరూపితమైంది. ఇతర రాష్ట్రాలకు కూడా అవార్డులు వచ్చినా, పర్యాటక రంగంలో ఉత్తమ రాష్ట్రంగా ఎంపికవడంతోపాటు మొత్తం 4 అవార్డులతో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది.