Telugu Global
Telangana

తెలంగాణ ఒక వైపు సంక్షేమం.. మరో వైపు అభివృద్ధితో దూసుకొని పోతున్నది : మంత్రి కేటీఆర్

9 ఏళ్లు పూర్తి చేసుకొని పదో ఏట అడుగు పెట్టిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రతీ రంగంలో దేశానికే దిక్సూచిలా మారింది. విద్యుత్, సాగు, తాగు నీరు, వైద్యారోగ్యం, విద్య, పరిశ్రమలు, ఐటీ.. ఇలా ఏ రంగం చూసినా తెలంగాణ అగ్రభాగాన ఉన్నదని మంత్రి చెప్పారు.

తెలంగాణ ఒక వైపు సంక్షేమం.. మరో వైపు అభివృద్ధితో దూసుకొని పోతున్నది : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ రాష్ట్రం ఒక వైపు సంక్షేమంతో పాటు మరో వైపు అభివృద్ధిలో దూసుకొని పోతున్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రెండు వేల రూపాయల పెన్షన్ అందుకుంటున్న ముసలవ్వ సంతోషంగా ఉన్నది. మరోవైపు రాయితీలు అందుకుంటూ పరిశ్రమలను చక్కగా నడుపుకుంటున్న పారిశ్రామికవేత్తలు ఆనందంగా ఉన్నారని మంత్రి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో కొత్తగా నిర్మించిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్లను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..

9 ఏళ్లు పూర్తి చేసుకొని పదో ఏట అడుగు పెట్టిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రతీ రంగంలో దేశానికే దిక్సూచిలా మారింది. విద్యుత్, సాగు, తాగు నీరు, వైద్యారోగ్యం, విద్య, పరిశ్రమలు, ఐటీ.. ఇలా ఏ రంగం చూసినా తెలంగాణ అగ్రభాగాన ఉన్నదని మంత్రి చెప్పారు. పర్యావరణంలో, పరిశ్రమల స్థాపనలో అగ్రభాగంలో నిలిచామని కేటీఆర్ అన్నారు. ఇదొక సమ్మిళితమైన అభివృద్ధి అని చెప్పారు. తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నదని కేటీఆర్ అన్నారు. ఈ మాటలేవో బాగున్నాయని చెప్పడం లేదు. వీటి వెనుక అర్థం ఉంది కాబట్టే చెబుతున్నాను. దేశంలోనే తెలంగాణ ఒక అరుదైన రాష్ట్రం. దేశంలోని 29 రాష్ట్రాల్లో చూడని అరుదైన అభివృద్ధి దృశ్యాన్ని మనం సీఎం కేసీఆర్ నాయకత్వంలో చూస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. కానీ, ఏ రాష్ట్రంలో జరగని అనేక కార్యక్రమాలు కేవలం 9 ఏళ్లలో తెలంగాణలో జరిగాయని మంత్రి చెప్పారు. పర్యావరణంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణలో హరితహారం కారణంగా గతంలో కంటే ఎక్కువ అడవులు అభివృద్ధి చెందాయని కేటీఆర్ అన్నారు. మరోవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ ముందు భాగంలో ఉన్నది. ఇటీవల అమెరికా, యూకే పర్యటనలో ఒక పెద్ద సంస్థకు చెందిన వ్యక్తితో మాట్లాడాను. మన రాష్ట్రంలో అమలు అవుతున్న టీఎస్ ఐపాస్ అనే విధానం గురించి చెప్పాను.

రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పకుండా.. స్వీయ దృవీకరణ ద్వారా పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉందని చెప్పాను. అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నది. ఏ అధికారిని కలవకుండానే.. అన్ని పత్రాలు జత చేస్తే 15 రోజుల్లో అనుమతులు వస్తాయని చెప్పాను. ఇండియాలో ఇలాంటి పాలసీ లేదని చెబితే.. ఆ అమెరికా సంస్థకు చెందిన అధికారి నవ్వి.. ఇండియాలో కాదు.. అమెరికాలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పాలసీ లేదని చెప్పారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ రోజు పరిశ్రమల అనుమతుల విషయంలో దేశానికే కాదు ప్రపంచానికే బెంచ్ మార్క్‌లాగా టీఎస్ ఐపాస్ ఉందని మంత్రి వెల్లడించారు.

తెలంగాణ జనాభా దేశంలో 3 శాతమే. కానీ ఇటీవల పల్లెలకు అవార్డులు ప్రకటిస్తే 30 శాతం మనకు వచ్చాయి. పట్టణ ప్రగతిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డలు కూడా వచ్చాయి. పల్లెలలో పాటు పట్టణాలు కూడా అభివృద్ధి పథంలో దూసుకొని పోతున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇలాంటి ఆచరణాత్మకమైన అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదని మంత్రి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం విడిపోతే ఇక్కడ పరిశ్రమలు వస్తాయా? ఉన్నయే వెళ్లిపోతాయని భయపెట్టారు. ఇక్కడి నాయకులకు అంత సమర్థత ఉందా? అని వ్యాఖ్యానించారు. కానీ 9 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం దేశానికే పాఠాలు నేర్పుతుంటే ఆనాడు ప్రశ్నించిన వాళ్లే నోరెళ్లబెట్టుకొని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.

గుజరాత్ వికాస్ నిగమ్ వాళ్లు ఈ మధ్య పారిశ్రామిక వేత్తలకు ఒక లేఖ రాశారు. ఎండకాలం వల్ల పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ఇస్తున్నామని ప్రకటించారు. కరెంటు కొరత కారణంగానే విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నామని లేఖ రాశారు. పాతికేళ్లకు పైగా ప్రధాని నరేంద్ర మోడీ సీఎంగా పరిపాలించిన గుజరాత్‌లో ఈ రోజుకు కూడా పవర్ హాలీడేలు ఉన్నాయి. మన దగ్గర అలాంటి బాధలే లేవని కేటీఆర్ అన్నారు. తాగు నీటికి, సాగు నీటికి బాధ లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. మన పిల్లలు, మన భవిష్యత్ కోసం ఆలోచించే సీఎం దేశంలో కేసీఆర్ కాకుండా మరెవరైనా ఉంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

కేసీఆర్ నెక్ట్స్ ఎలక్షన్ గురించి కాదు.. నెక్ట్స్ జనరేషన్ గురించి ఆలోచించే సీఎం అని కేటీఆర్ చెప్పారు. గత పాలకులు ఏమీ చేయలేదని నేను చెప్పను. కానీ 60 ఏళ్లలో ఎంత పని జరిగిందో.. అంతకు మించిన పని 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసిన అమెరికా ప్రతినిధులు తనను వచ్చి అక్కడ ఆ విజయాన్ని వివరించమంటే ఇటీవలే వెళ్లి ప్రసంగించాను. ఆ రోజు అక్కడి సివిల్ ఇంజనీర్లు కాళేశ్వరంను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ ప్రాజెక్టు కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాకుండా.. ప్రపంచ దేశాలకే పెద్ద పాఠమని మెచ్చుకున్నారని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ఐటీ,వ్యవసాయ ఉత్పత్తుల్లో దూసుకొని పోతోంది. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే.. ఈ రోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా పండిస్తున్నాము. ఇది సాగునీటిలో మన రాష్ట్రం సాధించిన విజయమని కేటీఆర్ అన్నారు. ఐటీ ఉత్పత్తుల్లో ఒకప్పుడు రూ.56 వేల కోట్ల ఎగుమతులు ఉంటే.. ఇప్పుడు రూ.2.41 లక్షల కోట్లకు ఎదిగాము. ఈ లెక్కలన్నీ నిజం కాదా.. గణాంకాలు తప్పా అని ప్రశ్నించారు.

నాకో, సీఎం కేసీఆర్‌కో మీరు బాకా ఊదాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందో మీరు మీ సంస్థలో పని చేసే కార్మికులు, ఉద్యోగులకు చెప్పాని పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ సూచించారు. అలాగే, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని కూడా కోరారు. మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, చౌటుప్పల్‌కు చెందిన వారికి స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ ప్రాంత యువతకు అవకాశాలు ఇస్తే.. వాళ్లు కూడా జీవితంలో ఎదిగే అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

అంతకు ముందు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న చేనేత వస్త్ర షోరూం సముదాయానికి మంత్రి కేటీఆర్, జగదీశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.




First Published:  6 Jun 2023 2:41 PM IST
Next Story