Telugu Global
Telangana

సీబీఐకి 'సాధారణ అనుమతి' రద్దు చేసిన రాష్ట్రాలు ఏవో తెలుసా? తెలంగాణ మొదటిది కాదు!

సీబీఐ తమ అనుమతి లేకుండా రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన రాష్ట్రం తెలంగాణే మొదటిది కాదు. గతంలో 9 రాష్ట్రాలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నాయి.

సీబీఐకి సాధారణ అనుమతి రద్దు చేసిన రాష్ట్రాలు ఏవో తెలుసా? తెలంగాణ మొదటిది కాదు!
X

తెలంగాణ రాష్ట్రంలోకి సీబీఐ రావడానికి 'సాధారణ అనుమతి'ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అగస్టు 30న జీవో నెంబర్ 51ని జారీ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థగా పేరు పడిన సీబీఐని ఒక రాష్ట్రం రాకుండా అడ్డుకోగలదా అని ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం తమకు ఉన్న విస్తృత అధికారాల మేరకే ఈ జీవో జారీ చేసిందని అధికారులు చెప్తున్నారు. సీబీఐ తమ అనుమతి లేకుండా రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన రాష్ట్రం తెలంగాణే మొదటిది కాదు. గతంలో 9 రాష్ట్రాలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నాయి.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని 1963లో కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసింది. దేశంలో అవినీతిని నిరోధించడానికి ఒక వ్యవస్థ ఉండాలని శాంతనం కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1946 కింది సీబీఐని ఏర్పాటు చేయడంతో దీనికి కేంద్ర చట్టబద్దత లేదు. ఢిల్లీలో తప్ప వేరే రాష్ట్రాల్లో ఈ సంస్థ దర్యాప్తుకు వెళ్లాలంటే తప్పకుండా అక్కడి ప్రభుత్వపు అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి. మన దగ్గర ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనికి వేరే స్టేషన్ పోలీసులు రావాలంటే ఎలాంటి అనుమతులు కావాలో.. సీబీఐకి కూడా అలాంటి అనుమతిని రాష్ట్రం ఇవ్వాలి.

కాగా, ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలను ఇష్టానుసారం వాడుతూ, ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చడానికి కూడా ఉపయోగిస్తుండటంతో వ్యతిరేకత మొదలైంది. చాలా రాష్ట్రాలు సీబీఐని తమ రాష్ట్రంలోకి రావడానికి అనుమతిని నిరాకరిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి 'సాధారణ అనుమతి'ని రద్దు చేసినట్లు కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. మిజోరాం, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గడ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్, పంజాబ్, మేఘాలయ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ రాతపూర్వకంగా రాజ్యసభలో తెలియజేశారు.

అయితే సీబీఐ ఎంక్వైరీకి రెండు రకాల అనుమతులు ఉంటాయి. ఒకటి సాధారణ అనుమతి, రెండోది కేసుకు సంబంధించిన అనుమతి. ఏదైనా కేసుకు సంబంధించి నిందితులు, సాక్షులను విచారించాలంటే స్పెసిఫిక్ కాన్సంట్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు వివరించాలి. దాన్ని పరిశీలించిన తర్వాత సీబీఐకి అనుమతి ఇవ్వాలా వద్దా అని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఇక 'సాధారణ అనుమతి' (జనరల్ కాన్సంట్) ఇస్తే సీబీఐ రాష్ట్రంలోకి రావడానికి ప్రతీ సారి అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదు. ఏ కేసు కోసం వస్తున్నారో.. ఎవరిని విచారిస్తున్నారో రాష్ట్రానికి తెలియజేయాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జీవో 51 ద్వారా సీబీఐకి జనరల్ కాన్సంట్‌ను ఉపసంహరించుకున్నది. అంటే సీబీఐని రాకుండా పూర్తిగా నిరోధించినట్లు కాదు. కానీ, కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ముందుగానే ప్రభుత్వానికి తెలియజేసి.. ప్రభుత్వ అనుమతితో నిందితులు, సాక్షులు, ఇతరులను విచారించే అవకాశం ఉన్నది.

First Published:  30 Oct 2022 8:30 AM GMT
Next Story