Telugu Global
Telangana

ఐదు విప్లవాలతో తెలంగాణ దూసుకొని పోతున్నది : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం వంటి ప్రపంచంలోనే భారీ ఎత్తి పోతల పథకాన్ని నాలుగేళ్లలోనే పూర్తి చేశామని చెప్పారు. ఇది ఐదు రకాల విప్లవాలకు దారి తీసిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఐదు విప్లవాలతో తెలంగాణ దూసుకొని పోతున్నది : మంత్రి కేటీఆర్
X

ఐదు విప్లవాలతో తెలంగాణ దూసుకొని పోతున్నది : మంత్రి కేటీఆర్

9 ఏళ్ల క్రితమే ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు దేశానికే దారి చూపిస్తున్నది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది. ఐదు విప్లవాలతో తెలంగాణ ఇప్పుడు దూసుకొని పోతున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుడ్ ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్ట్, రిటైల్ కంపెనీ లూలూ గ్రూప్ తెలంగాణ కార్యకలాపాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లూలూ గ్రూప్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం వంటి ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకాన్ని నాలుగేళ్లలోనే పూర్తి చేశామని చెప్పారు. ఇది ఐదు రకాల విప్లవాలకు దారి తీసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో కంటే సాగు విస్తీర్ణం పెరిగిందని.. దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి చెప్పారు. ఇది గ్రీన్ రివల్యూషన్ అన్నారు. ఇక పింక్ రివల్యూషన్ ద్వారా తెలంగాణ ఇప్పుడు అత్యధిక మాంసం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదిగిందని చెప్పారు. ఒకప్పుడు తెలంగాణ రోజుకు 300 ట్రక్కుల జీవాలను దిగుమతి చేసుకునేది. కానీ, గొల్ల కురుమలకు ఉచిత గొర్రెల పంపిణీ పథకం ద్వారా జీవాలను అందించాము. దీని వల్ల రాష్ట్రంలో జీవాల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మాంసం ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని మంత్రి కేటీఆర్ వివరించారు.

బ్లూ రివల్యూషన్ కూడా కాళేశ్వరం వల్ల సాధ్యమయ్యిందని చెప్పారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటల్లో భారీగా మత్స్యసంపద పెరిగిందని చెప్పారు. దేశంలోనే ఇన్‌లాండ్ ఫిషరీస్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఇక వైట్ రివల్యూషన్ ద్వారా పాలు, పాల ఉత్పత్తులు పెరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ప్రభుత్వం రంగ విజయ డెయిరీ నష్టాల్లో ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల కారణంగా విజయ డెయిరీ ఇప్పుడు లాభాల్లో ఉన్నది. కేవలం విజయ డెయిరీ మాత్రమే కాకుండా.. కోఆపరేటీవ్ డెయిరీలు అయిన మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ప్రైవేటు రంగంలోని హెరిటేజ్, దొడ్ల వంటి కంపెనీలు లాభాలను అర్జిస్తున్నాయని చెప్పారు.

తెలంగాణలో భారీ డెయిరీ ప్లాంట్‌ను ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయనున్నాము. దాదాపు రూ.300 కోట్లతో ఆగస్టులో ఆ డెయిరీ ప్రారంభం అవుతుందన్నారు. ఇక రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని.. తద్వారా ఎల్లో విప్లవాన్ని తీసుకొని రావాలని భావిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో వంట నూనెల కొరత ఉన్నది. 80 శాతం ఆయిల్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా.. తెలంగాణలో భారీగా ఆయిల్ పామ్ సాగును చేపట్టామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

తెలంగాణలో లూలూ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనుండటం పట్ల ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ యూసుఫ్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో భారీ ఆక్వా హబ్‌ను సిరిసిల్లలో ప్రారంభిస్తున్నాము. వీలుంటే ఆ యూనిట్‌ను సందర్శించాలని కోరారు. అలాగే, 10 వేల ఎకరాల్లో 16 క్లస్టర్లుగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని.. వీలుంటే అక్కడ లూలూ గ్రూప్ కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు.

First Published:  26 Jun 2023 11:04 AM IST
Next Story