Telugu Global
Telangana

తెలంగాణ నేల కాదు తల్లి వంటిది -ప్రియాంకా గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 4 వేలు భృతి ఇస్తామని ప్రియాంకా గా‍ంధీప్రకటించారు. యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు.

తెలంగాణ నేల కాదు తల్లి వంటిది -ప్రియాంకా గాంధీ
X

తెలంగాణ కేవలం ఒక పటంలోని ప్రాంతం మాత్రమే కాదు. ఇక్కడి ప్రజలకు ఈ నేల తల్లితో సమానం అని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌లో నిర్వహించిన 'యువ సంఘర్షణ' సభలో ఆమె మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ కోసం ఎందరో ఆత్మ బలిదానాలు చేశారు. మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది. ఆ బాధ ఏంటో మాకు తెలుసు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం అంత సులభంగా జరగలేదు. తెలంగాణ ఇవ్వాలని సోనియాగాంధీ తపనపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలనే ఆమె తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలంగాణ ఇవ్వలేదు. ప్రజల ఆకాంక్షలునెరవేరాలని రాష్ట్రం ఏర్పాటు చేశాం అని ప్రియాంక తెలిపారు.

''ఈ దేశం కోసం నా కుటుంబ సభ్యులు ప్రాణాలిచ్చారురు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ అమరులయ్యారు. ఇందిర గాంధీ మరణించి ఏళ్లు గడిచినా ఆమె ప్రజల కోసం చేసిన పనుల వల్ల ఇప్పటికీ ఆమెను ప్రజలు స్మరించుకుంటున్నారు. కాంగ్రెస్ ఇందిరమ్మ బాటలోనే నడుస్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఓట్లు వేసేప్పుడు విజ్ఞతతో వ్యవహరించండి. కాంగ్రెస్ ను గెలిపిస్తే అధికారంలోకి రాగానే యూత్ డిక్లరేషన్ అమలు చేసి తీరతాం.సోనియమ్మ బిడ్డగా మాట ఇస్తున్నా.. '' అని ప్రియాంక అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 4 వేలు భృతి ఇస్తామని ఆమె ప్రకటించారు. యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు.

First Published:  8 May 2023 7:48 PM IST
Next Story