విద్యుత్ అమ్మే స్థాయికి తెలంగాణ చేరుకోబోతోంది : ఆర్థిక మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ 24 గంటలూ ఇస్తున్నాము. విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగు పరచడానికి రూ.40 వేల కోట్లు వెచ్చించాము.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పూర్తిగా అంధకారం ఏర్పడుతుంది. విద్యుత్ కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందని ఆనాడు చాలా మంది వ్యాఖ్యానించారు. కానీ అంధకారం అన్న చోటే ఇప్పుడు వెలుగులు విరాజిల్లుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి విద్యుత్‌ను అమ్మే స్థాయికి తెలంగాణ చేరుకోబోతోందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఇప్పుడు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్‌లో నిర్వహించిన సీఎఫ్‌వో కాంక్లేవ్ 4వ ఎడిషన్‌కు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ 24 గంటలూ ఇస్తున్నాము. విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగు పరచడానికి రూ.40 వేల కోట్లు వెచ్చించాము. హైదరాబాద్‌లో ఎలాంటి నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందో.. రాష్ట్రం చివరి గ్రామంలో కూడా అలాంటి విద్యుత్ అందుతోంది. రాష్ట్రంలో ఇప్పుడు వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం 17వేల మెగావాట్లుగా ఉందని హరీశ్ రావు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి మరో 20వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో వచ్చే ఏడాది నుంచి మిగిలే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయికి చేరుకుంటుందన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే కాకుండా.. ఒక సీఈవో, సీఎఫ్‌వో లాగా మారి అహర్నిశలు శ్రమిస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పారు. సాంకేతిక, పరిశోధన, సుపరిపాలన అనే అంశాలతో సమావేశం నిర్వహించడం చాలా అభినందనీయం అన్నారు. గతంలో ఎంతో మంది సీఎంలను చూశాము. కొంత మంది సంక్షేమంపై దృష్టి పెడితే, మరికొంత మంది అభివృద్ధిపై ఫోకస్ చేసే వారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. అభివృద్ధిని ఏ ఒక్క రంగానికో పరిమితం చేయకుండా అన్నింటినీ సమానంగా చూస్తున్నారని పేర్కొన్నారు.
ఒకప్పుడు తెలంగాణ ప్రజానీకం దుబాయ్, బొంబాయి అంటూ వలస బాట పట్టేవారు. బతుకు తెరువు కోసం రాష్ట్రం దాటి వెళ్లేవారు. కానీ సీఎం కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలోనే ఉపాధి లభిస్తోంది. దీంతో వలసలు దాదాపు బంద్ అయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.17 లక్షలతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ధాన్యం ఉత్పత్తిల్లో 40 ఏళ్లుగా పంజాబ్ అగ్రస్థానంలో ఉండేది. కానీ ఈ సారి తెలంగాణ దాన్ని అధిగమించింది. ఈ దఫా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామని హరీశ్ రావు వెల్లడించారు.
రిజిస్ట్రేషన్లలో ధరణి ఒక విప్లవం సృష్టించిందని హరీశ్ రావు అన్నారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయన్నారు. ఒకటి రెండు వారాల్లోనే పాస్‌బుక్‌లు నేరుగా ఇంటికి వస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రైతు బంధు కింద రూ.65 వేల కోట్లు ఇచ్చినట్లు హరీశ్ రావు వివరించారు. 46 లక్షల మంది ఆసరా లబ్దిదారుల ఖాతాల్లోకి ఫించన్ డబ్బు నేరుగా జమ చేస్తున్నట్లు చెప్పారు.