Telugu Global
Telangana

మొబిలిటీ రంగంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉంది : మంత్రి కేటీఆర్

రాష్ట్ర మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిన తర్వాత ఇక్కడకు ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. ఇక్కడి అనుకూలమైన వాతావరణమే ఇందుకు కారణం అని మంత్రి కేటీఆర్ చెప్పారు.

మొబిలిటీ రంగంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉంది : మంత్రి కేటీఆర్
X

కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఎలా అగ్రగామిగా ఉన్నదో.. మొబిలిటీ రంగంలో కూడా తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 2023 నాటికి దేశంలో ఉత్పత్తి అవుతున్న ఈ-బ్యాటరీల్లో 60 శాతం మన దగ్గరే తయారవుతాయని మంత్రి చెప్పారు. శంషాబాద్ జీఎంఆర్ ఏరో సిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ కొత్తగా నిర్మిస్తున్న ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్‌కు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

రాష్ట్ర మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిన తర్వాత ఇక్కడకు ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. ఇక్కడి అనుకూలమైన వాతావరణమే ఇందుకు కారణం అని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గల్లా జయదేవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్మించిన గిగా ఫ్యాక్టరీ కారిడార్‌లో భాగంగా అనునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాన్ని అమరరాజా సంస్థ ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి నిర్వహించిన ఎవాల్వ్ సదస్సులో అమరరాజా సావనీర్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్లను నెలకొల్పడానికి జహీరాబాద్‌ను ఎంపిక చేశామని చెప్పారు. యువ నైపుణ్యాన్ని ఒడిసిపట్టడంలో టీఎస్ఐసీ కృషి చేస్తోందని వెల్లడించారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కోసం కట్టింగ్ ఎడ్జ్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, నీతి ఆయోగ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సలహాదారు సుధేందు సిన్హా పాల్గొన్నారు.


First Published:  11 Aug 2023 5:12 PM IST
Next Story