వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది : కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
జూన్ 15 నుంచి 17 వరకు హెచ్ఐసీసీలో వ్యవసాయ రంగానికి సంబంధించి జీ-20 సదస్సును ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి తోమర్ వెల్లడించారు.
వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోందని.. పంటల ఉత్పత్తి, ఉత్పాదక రంగంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే చాలా ముందున్నదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో కనపరుస్తున్న అభివృద్ధిని చూసే.. ఈ అంశంలో జీ-20 సదస్సును హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. జూన్ 15 నుంచి 17 వరకు హెచ్ఐసీసీలో వ్యవసాయ రంగానికి సంబంధించి జీ-20 సదస్సును ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి తోమర్ వెల్లడించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని 'విస్తరణ విద్యా సంస్థ'లో కొత్తగా నిర్మించిన ఆడిటోరియంను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో భారత విశిష్టతను చాటి చెప్పేందుకు జీ-20 సదస్సును ఉపయోగించుకోవాలని చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణ అమలు చేస్తున్న పథకాలను కూడా ఈ సదస్సు వేదికగా వివరించాలని ఆయన చెప్పారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు, పరిశోధన, విస్తరణపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ మేరకు పంటల ఉత్పత్తిలో దేశం అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశోధనా రంగంలో సాధించిన ఫలితాలు మారు మూల ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులకు సైతం అందుబాటులోకి తీసుకొని రావాలని కోరారు.
హైదరాబాద్‌లో జీ-20 సదస్సును నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉందని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సదస్సు నిర్వహణలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. ఆహార ఉత్పత్తుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత తొమ్మిదేళ్లుగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ రంగంలో దేశానికే దిక్సూచిలా తెలంగాణ మారిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే మరిన్ని అద్భుత ఫలితాలు సాధిస్తుందని మంత్రి తెలిపారు.
ఐకార్ ఆధ్వర్యంలోని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అధికారులకు శిక్షణ ఇచ్చే విస్తరణ విద్యా సంస్థలో నూతన ఆడిటోరియం ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి @nstomar గారు, హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి @SingireddyBRS గారు, కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహూజా గారు, pic.twitter.com/Xto7geA2Wt
— Singireddy Niranjan Reddy (@SingireddyBRS) May 15, 2023