Telugu Global
Telangana

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక రద్దు చేయాలంటూ బీఎస్పీ నేత పిటిషన్

పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే విజయుడికి నోటీసులు జారీ చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక రద్దు చేయాలంటూ బీఎస్పీ నేత పిటిషన్
X

తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు లేదని తేలిపోయిన తర్వాత ఆ రెండు పార్టీల మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసినవే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నికల చెల్లదంటూ బీఎస్పీ నేత హైకోర్టు మెట్లెక్కడం విశేషం. అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడి ఎన్నికను రద్దు చేయాలంటూ బీఎస్పీ అభ్యర్థి ఆర్.ప్రసన్న కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎమ్మెల్యే విజయుడికి నోటీసులు జారీ చేసింది.

ఎందుకు చెల్లదంటే..?

విజయుడి విజయం చెల్లదని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని తన పిటిషన్ లో కోరారు బీఎస్పీ నేత ప్రసన్న కుమార్. ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతీలో విజయుడు గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గా పనిచేసేవారు. ఆ పదవికి ఆయన రాజీనామా చేయకుండానే నామినేషన్‌ దాఖలు చేశారనేది బీఎస్పీ నేత ప్రధాన ఆరోపణ. తన వృత్తికి సంబంధించిన వివరాలను విజయుడు నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. రాజీనామా లేఖను, తదితర వివరాలను ఆయన అఫిడవిట్ తో పాటు సమర్పించలేదని అంటున్నారు. విజయుడి ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఎన్నికల ముందు కూడా ప్రసన్న కుమార్ ఇలాంటి పిటిషన్ వేయగా అప్పట్లో కోర్టు జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు మాత్రం కోర్టు వివరణ కోరుతూ విజయుడికి నోటీసులివ్వడం గమనార్హం.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి వివరణ ఇవ్వాలంటూ విజయుడికి నోటీసులు జారీ చేశారు. విచారణను ఏప్రిల్‌ 18వ తేదీకి వాయిదా వేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా ఇలాంటి పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. చివరికి 2023 ఎన్నికల నాటికి ఆ కేసులన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. ఇక ఇప్పుడు వేసిన పిటిషన్ల వ్యవహారం ఎప్పటికి తేలుతుందో చూడాలి.

First Published:  22 March 2024 10:33 AM IST
Next Story