Telugu Global
Telangana

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస తీర్పులు

తెలంగాణలోని పరిస్థితులు, వెలువడుతున్న కోర్టు తీర్పుల్ని గమనిస్తే.. కచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే అనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా కోర్టు తీర్పులు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస తీర్పులు
X

ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు, కొందరు కోర్టుల్ని ఆశ్రయిస్తారు కూడా. అయితే అన్ని సందర్భాల్లో కోర్టులు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడతాయని అనుకోలేం. ఇటీవల కాలంలో తెలంగాణలోని పరిస్థితులు, వెలువడుతున్న కోర్టు తీర్పుల్ని గమనిస్తే.. కచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే అనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా కోర్టు తీర్పులు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తున్నాయి.

ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది ఆల్రడీ గతంలో రద్దయిన పరీక్ష, రెండోసారి జరిగింది. గతంలో పేపర్ లీకేజీ బలమైన కారణమే అనుకున్నా, రెండోసారి మాత్రం అభ్యర్థులనుంచి బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణంతో హైకోర్టు పరీక్షలను రద్దు చేసింది. దీనిపై డివిజన్ బెంచ్ ని TSPSC ఆశ్రయించినా.. రద్దు వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల విషయంలో కూడా హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం హడావిడి పడాల్సిన పరిస్థితి. రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఆ జిల్లాలో బదిలీల ప్రక్రియ ఆగిపోయింది. వేరే జిల్లా వారిని రంగారెడ్డి జిల్లాలో నియమిస్తున్నారంటూ పలువురు స్కూల్‌ అసిస్టెంట్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సింగరేణి విషయంలో కూడా అంతే. సింగరేణి కాలరీస్‌ సంస్థలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పోస్టుల భర్తీకి యాజమాన్యం వెలువరించిన నియామక నోటీఫికేషన్‌ ని హైకోర్టు రద్దు చేసింది. పరీక్షల నిర్వహణలో అవకతవలకు జరిగాయన్న కారణంగా వాటిని రద్దు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఆ నోటిఫికేషన్ నే రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 28 విషయంలో కూడా హైకోర్టు అడ్డుకట్ట వేసింది. జీవో అమలు చేయకుండా యదాతథస్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇటీవల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 623 ఏఎన్‌ఎం పోస్టుల నియామకాలను కూడా నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

గతంలో విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ)లను జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమిచే నిర్ణయాన్ని కూడా తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. అది చట్ట వ్యతిరేకమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తుల విభాగం, అగ్నిమాపక శాఖ లో డ్రైవర్ పోస్ట్ ల భర్తీ విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ ల రెన్యువల్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కనపెట్టింది. నియామకాల ప్రక్రియలే కాదు.. ఇటీవల తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా జరిమానా విధిస్తూ, సాధారణ జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా కలకలం రేపింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌ ఆఫీసర్లు నవీన్‌ మిట్టల్, వాకాటి కరుణ తదితరులకు రూ.10 వేలు చొప్పున జరిమానా విధించింది హైకోర్టు, నెల రోజుల సాధారణ జైలు శిక్ష కూడా విధించింది.

వరుసగా ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా హైకోర్టునుంచి తీర్పులు రావడం గమనార్హం. అయితే ఈ తీర్పుల పట్ల ప్రభుత్వం ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే తనపని తాను చేసుకుపోతోంది.

First Published:  26 Sept 2023 11:14 AM IST
Next Story