ఎమ్మెల్సీల నియామకం.. తెలంగాణ సర్కారుకు హైకోర్ట్ షాక్
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తమను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని ప్రభుత్వం సూచించినా గవర్నర్ తిరస్కరించారంటూ ఆ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ కోర్టుకెళ్లారు.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను కొట్టేసింది. దీంతో గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నియమితులైన కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల పరిస్థితి డోలాయమానంలో పడింది.
ప్రమాణస్వీకారం చేయకుండానే..
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసేందుకు ఇద్దరి పేర్లను సిఫార్సు చేసింది. ఎన్నికల్లో తమకు సహకరించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు సియాసత్ ఉర్దూ పత్రిక జాయింట్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేర్లను జనవరి 27న ప్రతిపాదించింది. వీటికి గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు. అయితే వీరి ప్రమాణస్వీకారానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరు కాలేదు. ఐదు గంటలు వేచిచూసినా ఆయన రాకపోవడంతో కోదండరామ్, అమీర్ అలీఖాన్ వెనుదిరిగారు.
బీఆర్ఎస్‌ప్రభుత్వం అధికారంలో ఉండగా తమను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని ప్రభుత్వం సూచించినా గవర్నర్ తిరస్కరించారంటూ ఆ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ కోర్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో తాము తదుపరి ఆదేశాలిచ్చేవరకు కోదండరామ్, అలీఖాన్‌లతో ప్రమాణస్వీకారం చేయించవద్దని హైకోర్టు గవర్నర్‌కు సూచించింది. ఇప్పుడు వారి నియామకానికి ఇచ్చిన గెజిట్‌నే కొట్టివేసింది. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.