ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు.. సీబీఐ విచారణకు నిరాకరించిన హైకోర్టు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తమకు సంబంధం లేదని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. కానీ బీజేపీ నాయకులే తిరిగి విచారణ ఆపాలని, సీబీఐకి ఇవ్వాలంటూ పలు పిటిషన్లు హైకోర్టులో వేస్తున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన కేసులో సీబీఐ దర్యాప్తుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలో సింగిల్ జడ్జి విచారణ జరుగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. సిట్ చీఫ్ సీవీ ఆనంద్ పారదర్శకంగా ఈ కేసును దర్యాప్తు చేయాలని హైకోర్టు సూచించింది. మీడియాకు గానీ, రాజకీయ నాయకులకు గానీ ఇతర ప్రైవేటు వ్యక్తులకు గానీ సిట్ తమ విచారణ వివరాలు అందించకూడదని హైకోర్టు ఆదేశించింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావులను కొనుగోలు చేయడానికి బీజేపీకి చెందిన ఏజెంట్లు ప్రయత్నించారు. భారీ మొత్తంలో డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఎర చూపారు. ఆ రోజే సైబరాబాద్, మొయినాబాద్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్లు రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసును లోతుగా విచారించే నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం సీవీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక దర్యప్తు బృందాన్ని నియమించింది.
అయితే, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ పోలీసులు, సిట్‌పై తమకు నమ్మకం లేదని.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరగాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారించిన కోర్టు బీజేపీ నేతల డిమాండ్‌ను నిరాకరిస్తూ తీర్పు చెప్పింది. సిట్ మరింత పారదర్శకంగా దర్యాప్తు చేసి ఈ నెల 29న పురోగతికి సంబంధించిన వివరాలను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తమకు సంబంధం లేదని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. కానీ బీజేపీ నాయకులే తిరిగి విచారణ ఆపాలని, సీబీఐకి ఇవ్వాలంటూ పలు పిటిషన్లు హైకోర్టులో వేస్తున్నారు. నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతితో తమకు సంబంధం లేదని చెప్పిన బీజేపీనే.. ఆయనను కాపాడటానికి ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో బీజేపీ నాయకులు సీబీఐ విచారణ కోసం పిటిషన్ వేశారు. సీబీఐ విచారణ అయితే.. కేంద్రం పరిధిలో ఉంటుంది. కాబట్టి విచారణను ప్రభావితం చేయొచ్చని భావించినట్లు తెలుస్తున్నది. కానీ హైకోర్టు మాత్రం వారి పిటిషన్ కొట్టేస్తూ.. సిట్ విచారణను కొనసాగించాలని ఆదేశించింది.