Telugu Global
Telangana

కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే?

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో 32 ఎకరాల భూమి, శివారు వెంకటపూర్‌లో 4 ఎకరాలు కొడుకు హిమాన్షు పేరు మీద ఉందని, కానీ ఎన్నికల అఫిడవిట్‌లో ఆ ఆస్తులను ప్రస్తావించలేదన్నారు పిటిషనర్‌.

కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే?
X

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్ గెలిచిన విషయం తెలిసింది. ఐతే ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా కేటీఆర్‌తో పాటు ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.


2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి బీఆర్ఎస్ తరపున కేటీఆర్, కాంగ్రెస్ అభ్యర్థిగా కె.కె.మహేందర్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 29 వేల 687 ఓట్ల మెజార్టీతో కేటీఆర్ విజయం సాధించారు. ఐతే సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో 32 ఎకరాల భూమి, శివారు వెంకటపూర్‌లో 4 ఎకరాలు కొడుకు హిమాన్షు పేరు మీద ఉందని, కానీ ఎన్నికల అఫిడవిట్‌లో ఆ ఆస్తులను ప్రస్తావించలేదన్నారు పిటిషనర్‌. కాబట్టి కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ మహేందర్ రెడ్డి ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు.


లక్షల రూపాయల విలువైన ఈ భూములను హిమాన్షు సొంత డబ్బుతో కొనే అవకాశం లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు మహేందర్ రెడ్డి. కేటీఆర్‌ ఎన్నికను సవాల్ చేస్తూ న్యాయవాది శ్రీనివాస్ అనే వ్యక్తి మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు విచారణ చేపట్టారు. పిటిషనర్ అభ్యంతరాలపై వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్‌తో పాటు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేశారు.

First Published:  15 Jun 2024 4:20 AM GMT
Next Story