Telugu Global
Telangana

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు

ఖమ్మంలో ఏర్పాటు చేయాలనుకుంటే ఎన్టీఆర్ విగ్రహైనా పెట్టుకోవచ్చు. లేదంటే కృష్ణుడి విగ్రహమైనా పెట్టుకోవచ్చు. కానీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రం పెట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు
X

నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని లకారం చెరువు వద్ద 54 అడుగల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడిని పోలి ఉన్నదని చెబతూ ఇస్కాన్, ఆదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘంతో పాటు ఇతరులు 14 రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. విగ్రహం ఏర్పాటుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టవద్దని ఆంక్షలు విధించింది. ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

రిట్ పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఖమ్మంలో ఏర్పాటు చేయాలనుకుంటే ఎన్టీఆర్ విగ్రహైనా పెట్టుకోవచ్చు. లేదంటే కృష్ణుడి విగ్రహమైనా పెట్టుకోవచ్చు. కానీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రం పెట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశించింది.

ఖమ్మం లకారం చెరువు మధ్యలో ఉన్న తీగల వంతెనకు సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభిమానులు భావించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు తానా సభ్యులు, ఎన్నారైలు, పారిశ్రామికవేత్తల సహకారంతో రూ.4 కోట్ల వ్యయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహం తయారీకే రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తున్నది. 54 అడుగుల ఎత్తైన ఈ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్న సమయంలో హైకోర్టు స్టే విధించడం గమనార్హం.

కాగా, ఖమ్మంలో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో హిందువుల్లో ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఎన్టీఆర్‌ను కృష్ణుడి రూపంలో తీర్చిదిద్ది.. విగ్రహం ఏర్పాటు చేయడంపై యాదవ సంఘాలు కూడా మండిపడ్డాయి. ఇస్కాన్ కూడా కృష్ణుడి రూపంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు పలువురు హైకోర్టులో పిటిషన్లు వేయడంతో స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, హైకోర్టు స్టేతో నిర్వాహకుల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. దీనిపై వాళ్లు కోర్టుకు ఏమని కౌంటర్ దాఖలు చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొన్నది.

First Published:  18 May 2023 6:58 PM IST
Next Story