Telugu Global
Telangana

పీవోపీతో తయారు చేసే విగ్రహాలు నిషేధమే : 21న ఉత్తర్వులు ఇవ్వనున్న హైకోర్టు

ఈ నెల 21న తాము వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఉత్తర్వలు జారీ చేస్తామని, వాటికి అనుగుణంగానే ఈ ఏడాది పండుగ, నిమజ్జనం జరపించాలని హైకోర్టు సూచించింది.

పీవోపీతో తయారు చేసే విగ్రహాలు నిషేధమే : 21న ఉత్తర్వులు ఇవ్వనున్న హైకోర్టు
X

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినాయక నిమజ్జనం వంటి ప్రైవేటు కార్యక్రమాల్లో తలమునకలు అవడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ (పీవోపీ)తో చేసిన వినాయక విగ్రహాలపై విధించిన నిషేధాన్ని ఛాలెంజ్ చేస్తూ కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భుయాన్, జస్టిస్ నందా బెంచ్ విచారించింది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. ఈ నెల 21న తాము వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఉత్తర్వలు జారీ చేస్తామని, వాటికి అనుగుణంగానే ఈ ఏడాది పండుగ, నిమజ్జనం జరపించాలని హైకోర్టు సూచించింది.

ముంబై, కోల్‌కతా వంటి నగరాలు సముద్రతీరాల్లో ఉండటంతో అక్కడ నిమజ్జనాలు దాదాపు సముద్రంలోనే చేస్తారు. కానీ హైదరాబాద్ పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నది. ఇక్కడ చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం వల్ల అవి పూర్తిగా కలుషితం అవుతున్నాయని పేర్కొన్నది. అందుకే చెరువులు, కుంటల్లో విగ్రహాలు నిమజ్జనం చేయడంపై నిషేధం విధించామని తెలిపింది. దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని హైకోర్టు తెలిపింది.

గత ఏడాది వినాయక విగ్రహాల నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ పలు బేబీ పాండ్స్‌ను నిర్మించింది. ఇతర చెరువుల్లో వాటిని నిమజ్జనం చేయవద్దని.. కేవలం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన తాత్కాలిక కొలనులను వాడుకోవాలని తెలిపింది. కానీ, వేలాది విగ్రహాలు ప్రతిష్ఠించడంతో వాటిని మళ్లీ హైదరాబాద్‌లోని పలు జలాశయాల్లో నిమజ్జనం చేశారు. దీంతో హైకోర్టు 2022 నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలపై నిషేధం విధించినట్లు తెలిపింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్దేశించిన మార్గదర్శకాలను కూడా హైకోర్టు సమర్థించింది.

పీవోపీతో చేసిన విగ్రహాలను భారీగా చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల.. అవి నీటిలో కరుగకుండా కాలుష్యకారకాలుగా మిగిలిపోతున్నాయని అధికారులు అంటున్నారు. అందుకే జీహెచ్ఎంసీ మట్టి విగ్రహాలను గత కొన్నాళ్లుగా ప్రోత్సహిస్తోంది. అధికారులు పీవోపీతో చేసిన విగ్రహాలను తయారు చేయడానికి కూడా అనుమతించడం లేదు. దీంతో ధూల్‌పేటకు చెంది తెలంగాణ గణేష్ మూర్తి కళాకార్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నిర్ణయం వల్ల తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు కూడా పీవోపీని పూర్తిగా బ్యాన్ చేయలేదని వారి తరపు అడ్వ‌కేట్ బి. వెంకటేశ్వరరావు వివరించారు.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీవోపీ విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయవద్దని మాత్రమే పేర్కొన్నదని.. విగ్రహాలు తయారు చేయవద్దని ఎక్కడా చెప్పలేదని వాదించారు. మట్టితో చేసిన విగ్రహాలను అయినా.. చెరువుల్లోనే నిమజ్జనం చేస్తారు కదా అని పిటిషన్‌లో తెలిపారు.

పీవోపీతో తయారు చేసిన విగ్రహాల తయారీకి అనుమతించాలని, వాటిని కృత్రిమంగా ఏర్పాటు చేసిన కుంటల్లో నిమజ్జనం చేస్తామని పిటిషన్లు కోరారు. అధికారులు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతూ.. పేద విగ్రహాల తయారీదారులపై కొరడా ఝులిపిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై ఈ నెల 21న ఉత్తర్వలు వెలువరిస్తామని, హైకోర్టు కేసు వాయిదా వేసింది.

First Published:  15 July 2022 11:30 AM IST
Next Story