Telugu Global
Telangana

హైదరాబాద్‌లో పబ్‌లపై హైకోర్టు ఆగ్రహం.. మూడు కమిషనరేట్ల సీపీలకు నోటీసులు

నగరంలోని పబ్‌లలో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజేలు ఉండ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలపై నిషేధం విధించింది.

హైదరాబాద్‌లో పబ్‌లపై హైకోర్టు ఆగ్రహం.. మూడు కమిషనరేట్ల సీపీలకు నోటీసులు
X

హైదరాబాద్‌లో ఇటీవల పబ్‌లే కేంద్రంగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, అరాచకాలపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి పబ్‌లు నడిపిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో జనావాసాల మధ్యలో నిబంధనలు ఉల్లంఘించి, అధిక ధ్వనితో పబ్‌లు నిర్వహిస్తున్న తీరుపై నమోదైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు ఇలా నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లలో ఎన్నింటిపై కేసులు నమోదు చేశారో తెలిపాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సీపీలకు నోటీసులు జారీ చేసింది.

పబ్‌లకు సంబంధించి జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. పబ్‌లలో మ్యూజిక్, డ్యాన్సులకు అనుమతులు ఎలా ఇస్తున్నారో.. లైసెన్సుల మంజూరీ సమయంలో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారో తెలపాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. మితిమీరిన సౌండ్ వల్ల, డీజేల కారణంగా చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్థానిక పోలీసుల నుంచి డీజీపీ, ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని పిటిషన్‌ తరపు న్యాయవాది వాదించారు.

ఈ విషయంపై పూర్తిగా విచారించిన హైకోర్టు ఇకపై నగరంలోని పబ్‌లలో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజేలు ఉండ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీచేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలపై నిషేధం విధిస్తున్నట్లు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లు కూడా నిర్దేశిత పరిమితి వరకే అనుమతి ఉంటుందని పేర్కొన్నది. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం విద్యా సంస్థలు, ఇళ్లకు సమీపంలో పబ్‌లకు ఎలా అనుమతులు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై వెంటనే ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

First Published:  12 Sept 2022 8:02 PM IST
Next Story