Telugu Global
Telangana

పీవోపీ వినాయక విగ్రహాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక ట్విస్ట్

హైదరాబాద్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో చేసే గణేష్ విగ్రహాల తయారీపై ఈ ఏడాదికి అనుమతులు ఇస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అయితే విగ్రహాల నిమజ్జనంపై మాత్రం కఠినమైన షరతు పెట్టింది.

పీవోపీ వినాయక విగ్రహాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక ట్విస్ట్
X


ఈ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన మార్గదర్శకాలపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ధూల్‌పేటకు చెందిన వినాయక విగ్రహాల తయారీదారులు వేసిన కేసుపై గురువారం విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు ప్లాస్టర్ ఆఫ్ పారీస్ (పీవోపీ)తో తయారు చేసే విగ్రహాలను ఈ ఏడాదికి అనుమతిస్తున్నట్లు చెప్పింది. కానీ, ఈ విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి వీల్లేదని నిబంధన పెట్టింది. ఈ మేరకు బేబీ పాండ్స్ సిద్దం చేసి వాటిలో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది.

ఇక, పీవోపీ విగ్రహాలపై న్యాయస్థానం నిషేధం విధించడం కుదరదని.. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వమే పీవోపీ విగ్రహాలను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం చట్టం రూపొందించాలని సూచించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా పీవోపీ విగ్రహాలను మార్చి 2022లోగా బ్యాన్ చేస్తూ చట్టం చేయాలని సూచించాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదని మండిపడింది.

తెలంగాణ గణేష్ మూర్తి కళాకార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ సింగ్ ఈ ఏడాది పీవోపీ విగ్రహాల తయారీని అనుమతించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్. నంద విచారించారు. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు పీవోపీ విగ్రహాలను బ్యాన్ చేయకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

కాగా, సెప్టెంబర్ 15న పీవోపీ విగ్రహాలపై తుది విచారణ చేపడతామని.. సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు మార్గదర్శకాలను కూడా పరిశీలిస్తామని హైకోర్టు చెప్పింది. కాగా, పీవోపీ విగ్రహాలకు సంబంధించిన కౌంటర్ ఆ లోగా ఫైల్ చేస్తామని సీపీసీబీ అడ్వొకేట్ కొండపల్లి రవి కృష్ణకాంత్ వెల్లడించారు. గత ఏడాది జీహెచ్ఎంసీ, హెచ్‌డీఎంఏ ప్రామిస్ చేసినట్లుగానే.. ఈ ఏడాది కూడా బేబీ పాండ్స్ నిర్మించాలని హైకోర్టు సూచించింది. అంతే కాకుండా నిమజ్జనం పూర్తయిన వెంటనే ఆ కుంటలను వెంటనే శుభ్రం చేయాలని కూడా ఆదేశించింది.

First Published:  22 July 2022 11:06 AM IST
Next Story