కుక్కల దాడిలో బాలుడి మృతిపై హైకోర్టు విచారణ.. - అధికారులకు నోటీసులు
హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మృతిచెందిన ఘటనపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపై గురువారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం.. ఈ ఘటన మీ మనసులను కదిలించలేదా అంటూ ప్రభుత్వాన్ని, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రశ్నించింది. మనుషులపై వీధి కుక్కలు దాడి చేయకుండా ఏం చర్యలు తీసుకున్నారని అడిగింది. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శులకు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
విచారణలో భాగంగా జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది హైకోర్టులో తన వాదనలు వినిపించారు. బాలుడిపై దాడిచేసిన మూడు కుక్కలకు స్టెరిలైజ్ చేసి వదిలిపెట్టారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హైకోర్టు ధర్మాసనం కేసు విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఘటన పరిహారానికి అర్హమైన కేసు అని, బాలుడి తల్లిదండ్రులకు పరిహారం అంశాన్ని తదుపరి విచారణలో పరిశీలిస్తామని ధర్మాసనం ఈ సందర్భంగా వెల్లడించింది.