Telugu Global
Telangana

ద‌త్త‌త వెళ్లిన వారికి జ‌న్మించిన‌ కుటుంబంలో ఆస్తి హ‌క్కులుండ‌వు.. - తేల్చి చెప్పిన హైకోర్టు

ఒకసారి దత్తత వెళ్లినప్పుడు పుట్టిన కుటుంబంతో ఉన్న సంబంధాలన్నింటినీ వారు తెంచుకుంటారని, దత్తత తీసుకున్న కొత్త కుటుంబ బంధాలను పొందుతారని చట్టం చెబుతోందని న్యాయ‌స్థానం వివ‌రించింది.

ద‌త్త‌త వెళ్లిన వారికి జ‌న్మించిన‌ కుటుంబంలో ఆస్తి హ‌క్కులుండ‌వు.. - తేల్చి చెప్పిన హైకోర్టు
X

తెలంగాణ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. ద‌త్త‌త వెళ్లిన వ్య‌క్తికి తాను జ‌న్మించిన కుటుంబానికి చెందిన ఆస్తిలో హ‌క్కులుండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ఒక వ్యక్తి రెండు కుటుంబాల్లో ఉండరని, అలాంటప్పుడు ఆస్తిలో కూడా హక్కు ఉండదని పేర్కొంది. దత్తతకు వెళ్లకముందు ఆస్తుల పంప‌కాలు జ‌రిగితే.. ఆ ఆస్తిపై మాత్ర‌మే హ‌క్కు ఉంటుంద‌ని తెలిపింది. దత్తతకు వెళ్లకముందు ఎలాంటి కేటాయింపులూ లేకపోతే తాను పుట్టిన కుటుంబానికి చెందిన ఆస్తిలో వాటా ఉండదంటూ కీలక తీర్పు వెలువరించింది.

దత్తత వెళ్లినప్పటికీ జన్మించిన కుటుంబం ఆస్తిలో వాటా ఉంటుందంటూ ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఏవీఆర్ఎల్ నరసింహారావు ఖమ్మం సివిల్ కోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు పైవిధంగా తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నరసింహారావు సోదరుడు ఎ.నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు హైకోర్టులో అప్పీలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్ రావు, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన ధ‌ర్మాస‌నం సుదీర్ఘ విచార‌ణ జ‌రిపింది.

ఒకసారి దత్తత వెళ్లినప్పుడు పుట్టిన కుటుంబంతో ఉన్న సంబంధాలన్నింటినీ వారు తెంచుకుంటారని, దత్తత తీసుకున్న కొత్త కుటుంబ బంధాలను పొందుతారని చట్టం చెబుతోందని న్యాయ‌స్థానం వివ‌రించింది. పుట్టిన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేనప్పుడు ఆస్తిలో హక్కు పొందజాలరని స్ప‌ష్టం చేసింది.

కోల్‌క‌తాలోని 'దాయాభాగ', తెలుగు రాష్ట్రాల్లో మితాక్షర చట్టం ప్రకారం పుట్టిన వెంటనే ఉమ్మడి కుటుంబం ఆస్తిలో హక్కు పొందుతార‌ని ఉన్నప్పటికీ ప్రత్యేకంగా హక్కు పేర్కొనలేదంది. దీని ప్రకారం పూర్వీకుల ఆస్తిలో భాగం ఉంటుందని, అయితే పుట్టిన కుటుంబంలోని వారు సంపాదించిన ఆస్తిలో వాటా ఉండదని స్పష్టం చేసింది. యార్లగడ్డ నాయుడమ్మ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టప్రకారం సరికాదంది. మేన్స్ హిందూ చట్టం, ముల్లా సూత్రాలతో పాటు పాట్నా, అలహాబాద్ హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని.. దత్తతకు ముందు వాటా కేటాయించకపోతే పుట్టిన కుటుంబ ఆస్తిలో హక్కు ఉండదంటూ 44 పేజీల తీర్పును తెలంగాణ హైకోర్టు వెలువరించింది.

First Published:  4 July 2023 8:53 AM IST
Next Story