స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో సత్తా చాటిన తెలంగాణ.. కేటీఆర్ ట్వీట్
మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ అంటారని.. ఇది మామూలు ఘనత కాదంటూ ట్వీట్ చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో తెలంగాణ మరోసారి మెరిసింది. దక్షిణాది విభాగంలో తెలంగాణకు ర్యాంకుల పంట పండింది. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల విభాగంలో మొత్తం 40 ర్యాంకులు ఉండగా.. తెలంగాణ 31 ర్యాంకులతో సత్తా చాటింది
ఈ ర్యాంకులను మొత్తం నాలుగు విభాగాలుగా ప్రకటించారు. 15 వేల దిగువన జనాభా ఉన్న పట్టణాలు, 15-25 వేల జనాభా ఉన్న పట్టణాలు.. 25-50 వేల జనాభా, 50 వేలు - లక్ష జనాభా.. ఇలా నాలుగు కేటగిరీలుగా విభజించి ర్యాంకులు ప్రకటించారు. 15 వేలకు దిగువన జనాభా ఉన్న కేటగిరీలో తెలంగాణ నుంచి ఆరు గ్రామాలు చోటు దక్కించుకోగా.. 15-25 వేల జనాభా ఉన్న కేటగిరీలో 10కి 10 స్థానాలు తెలంగాణకే దక్కాయి. ఈ విభాగంలో గుండ్ల పోచంపల్లి టాప్ ప్లేసులో నిలిచింది. ఇక 25-50 వేల జనాభా ఉన్న పట్టణాల విభాగంగా తెలంగాణ 8 స్థానాలు దక్కించుకోగా.. కర్ణాటక నుంచి రెండు పట్టణాలకు ఈ కేటగిరీలో స్థానం లభించింది. ఇక 50-లక్ష మధ్య జనాభా ఉన్న పట్టణాల్లో మరోసారి సిద్దిపేట సత్తా చాటింది. ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పులివెందుల, బొబ్బిలి, తమిళనాడులోని మరైమలైనగర్‌కు చోటు దక్కింది. మిగతా ఏడు ర్యాంకులను తెలంగాణ కైవసం చేసుకుంది.
This is called a stellar performance 31/40 is no mean feat
— KTR (@KTRBRS) January 14, 2024
My compliments to the entire team of @TSMAUDOnline which has delivered exemplary results
Special thanks to the hardworking sanitation staff https://t.co/cRsRaA5oRn
స్వచ్ఛ్ సర్వేక్షన్ ర్యాంకులను IAS పమేలా సత్పతి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ అంటారని.. ఇది మామూలు ఘనత కాదంటూ ట్వీట్ చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్.