శ్రీకృష్ణ కమిటీ భయాలను తప్పు అని తెలంగాణ నిరూపించింది : సీహెచ్. హనుమంతరావు
9 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం పట్ల ఇతరులు వ్యక్తం చేసిన భయాలన్నింటినీ పక్కకు నెట్టి.. అభివృద్ధి పథంలో దూసుకొని పోతున్నదని ఆయన చెప్పారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడంపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం అప్పట్లో శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. సదరు కమిటీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మావోయిస్టుల ప్రభావం పెరుగుతుంది, మతతత్వ శక్తుల ఆగడాలు పెరుగుతాయని రిపోర్టు ఇచ్చింది. కానీ ఆ భయాలంతా తప్పు అని తెలంగాణ నిరూపించిందని ప్రముఖ ఆర్థిక వేత్త సీహెచ్. హనుమంతరావు అన్నారు. 9 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం పట్ల ఇతరులు వ్యక్తం చేసిన భయాలన్నింటినీ పక్కకు నెట్టి.. అభివృద్ధి పథంలో దూసుకొని పోతున్నదని ఆయన చెప్పారు.
'తెలంగాణ సాధించిన అభివృద్ధి, భవిష్యత్ అవకాశాలు' అనే అంశంపై ఆర్థిక, ప్రణాళిక శాఖ నిర్వహించిన సెమినార్‌లో హనుమంతరావు పాల్గొని, మాట్లాడారు. జాతీయ క్రైమ్ రికార్డు బ్యూరో, రాష్ట్ర క్రైం రికార్డు బ్యూరో రికార్డుల ప్రకారం వామపక్ష తీవ్రవాద పార్టీల ప్రభావం తెలంగాణలో తగ్గిపోయినట్లు స్పష్టం చేస్తున్నది. 2015 నుంచి 2021 మధ్య పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం నామ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికలో వెల్లడించిన భయాందోళనలు అన్నీ తప్పు అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందని పేర్కొన్నారు.
తెలంగాణలో శాంతి, భద్రతల సమస్య పెరుగుతుందని కూడా పేర్కొన్నారు. కానీ, తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని.. రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్పారు.
ఇక తెలంగాణ సామాజిక, ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో మెరుగైందని అన్నారు. తెలంగాణ జీఎస్‌డీపీ.. జాతీయ జీడీపీ పెరుగుదల రేటు కంటే ఎంతో ఎక్కువగా ఉందని హనుమంతరావు చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సలరంలో తెలంగాణ పర్ క్యాపిటా ఆదాయం రూ.3.17 లక్షలుగా ఉంది. కానీ జాతీయ సగటు మాత్రం కేవలం రూ.1.71 లక్షలు మాత్రమే అని హనుమంతరావు చెప్పారు.