Telugu Global
Telangana

కాంగ్రెస్‌ కు తెలంగాణ ఏటీఎంగా మారింది

అందుకే రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టు అంటోంది : కేటీఆర్‌

కాంగ్రెస్‌ కు తెలంగాణ ఏటీఎంగా మారింది
X

కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని.. ఢిల్లీకి డబ్బుల మూటలు పంపడానికే రేవంత్‌ రెడ్డి రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టు అంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌ లో ''మూసీ పునరుజ్జీవం - బీఆర్‌ఎస్‌ విజన్‌ అండ్‌ ఎఫర్ట్స్‌'' పేరుతో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ప్రణాళికాబద్ధంగా మూసీని ప్రక్షాళన చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అన్ని సర్వేలు చేసి మూసీ పునరుజ్జీవానికి రోడ్‌ మ్యాప్‌ రెడీ చేశామన్నారు. రివర్‌ బెడ్‌ లో 900 ఇండ్లు, బఫర్‌ జోన్‌ లో 11 వేల స్ట్రక్షర్స్‌ ఉన్నాయని గుర్తించామన్నారు. ఆ 11 వేల స్ట్రక్షర్స్‌ తొలగిస్తే లక్ష మంది నిరాశ్రయులవుతారని అప్పటి కేసీఆర్‌ వద్దని సూచించారని తెలిపారు. సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ మాదిరిగా మూసీకి రెండువైపులా రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మించి బఫర్‌ జోన్‌ లో ఉన్న ఏ ఒక్కరిని నిర్వాసితులను చేయకుండా మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు చేపట్టాలని తాము భావించామన్నారు. ఆ రోజే పేదవాళ్ల జోలికి పోవద్దని కేసీఆర్‌ సూచించారని.. ఈ రోజు రేవంత్‌ రెడ్డి ఆ పేదలను నిరాశ్రయులను చేసి మూసీ ప్రాజెక్టు చేపట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలే మూసీ బఫర్‌ జోన్‌లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చాయని తెలిపారు. మూసీ సుందీకరణ అన్నది.. రూ.1.50 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతామన్నది రేవంత్‌ రెడ్డి అని.. వాటికి సంబంధించిన వీడియోలు చూపించారు. ఇప్పుడు అదే మాట అంటే ముఖ్యమంత్రికి కోసం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచశ్రేణి సంస్థలు ఇచ్చిన డిజైన్లు సిద్ధంగా ఉన్నాయని, ఆమాత్రానికి రూ.141 కోట్లతో టెండర్‌ ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, బఫర్‌ జోన్‌ లోని ఇండ్లను కూల్చకుండా పనులు చేస్తే సరిపోతుందని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ పరివాహాక ప్రాంతంలో ఎలాంటి సర్వే చేయలేదని తెలిపారు. ప్రభుత్వం మూసీలో ఏ ఒక్కరి ఇల్లు కూల్చలేదన్న సీఎం మాట వట్టిదేనని.. అక్కడ పని చేస్తున్న కూలీలతో మాట్లాడితే జేసీబీలు, కూలీలను పెట్టి ఇండ్లను కూలగొడుతున్నారని తమతో చెప్పారన్నారు. మూసీ ప్రాజెక్టుకు మొదట రూ.50 వేల కోట్లు, తర్వాత రూ.70 వేల కోట్లు.. గోపనపల్లి ఫ్లై ఓవర్‌ ఓపెనింగ్‌ సమయంలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చవుతాయని సీఎం, టూరిజం మంత్రి చెప్పారని గుర్తు చేశారు. అది మూసీ బ్యూటీఫికేషన్ కాదు లూటీఫికేషన్ అని ప్రజలకు తెలిసిందని, దీంతో తప్పు కప్పి పుచ్చుకోవటానికి సీఎం నానా తంటాలు పడుతున్నారని అన్నారు. నోట్ల రద్దుపై బడే భాయ్‌ రోజుకో కారణం చెప్పినట్టే.. మూసీపై చోటే భాయ్‌ అట్లాగే మాట్లాడుతున్నాడని అన్నారు. 1908లో మూసీలో వరదలు వచ్చి 15 వేల మంది చనిపోయారని, అప్పటి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ వరదల నుంచి రక్షించడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నిర్మించారని తెలిపారు. వరదల నుంచి సిటీని రక్షించడానికి ఆ రెండు జలాశయాలు రక్షణ కవచంలా నిలిచాయన్నారు. ఆ తర్వాత ఏ ఒక్క ప్రభుత్వం మూసీపై పని చేయలేదని, 2014 జూన్‌ లో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మూసీ పునరుజ్జీవంపై ప్రయత్నాలు ప్రారంభించామన్నారు.

దేశంలోనే అత్యధిక కాలుష్యం బారిన పడిన నదుల్లో మూసీ మొదటి స్థానంలో ఉన్నట్టు 2015లోనే పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మూసీకి ఆ పరిస్థితి రాదని.. అంతుకు ముందు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలే అందుకు కారణమన్నారు. మూసీ నదిని పునరుజ్జీవింపజేసి నల్గొండకు గోదావరి నీళ్లు ఇవ్వాలని తాము సంకల్పించామన్నారు. రూ.1,100 కోట్లతో మల్లన్న సాగర్‌ నుంచి జంట జలాశయాలను లింక్‌ చేసి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం మొదలు పెట్టామని గుర్తు చేశారు. మూసీలో చేరే ప్రతి చుక్క మురికి నీటిని శుద్ధి చేయడానికి 31 ఎస్టీపీలు నిర్మించామన్నారు. ఎస్టీపీలకు తోడు గోదావరి నీళ్లతో మూసీ పునరుజ్జీవం సాధ్యమవుతుందన్నారు. నగరాన్ని ఈస్ట్‌ టు వెస్ట్‌ కలుపుతూ ఎక్స్‌ప్రెస్‌ వే, ఎస్టీపీలు, గోదావరితో లింక్‌ ప్రాజెక్టు, నదిపై బ్రిడ్జీలు, వాక్‌ వేలు, ఓపెన్‌ జిమ్‌ లు, పార్క్‌ లు సహా అన్ని పనులు చేసేందుకు ఎక్కువలో ఎక్కువ రూ.25 వేల కోట్లు సరిపోతాయని, అంతమాత్రానికి రూ.1.50 లక్షల కోట్లు ఎందుకో సమాధానం చెప్పాలన్నారు. నాగోల్‌ లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఎస్టీపీలను శనివారం సందర్శిస్తామని తెలిపారు. మూసీలో శుద్ధి చేసిన నీళ్లకు తోడు.. గోదావరి నీళ్లు తక్కువ ఖర్చుతో నల్గొండకు వెళ్తే మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి ఏమైనా ఇబ్బందా అని ప్రశ్నించారు. ఢిల్లీకి మూటలు పంపడానికి రేవంత్‌ చెప్పినట్టు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తేనే మంచిదా అని నిలదీశారు.

తాము చేపట్టిన స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఎన్‌డీపీ)తోనే ఇటీవల భారీ వర్షాలు కురిసినా హైదరాబాద్‌ లో ముంపు సమస్య రాలేదని, ఇదే విషయం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ కూడా చెప్పారని అన్నారు. కానీ రేవంత్‌ ప్రభుత్వం ఎస్‌ఎన్‌డీపీని పూర్తిగా రద్దు చేసిందన్నారు. ఇక్కడ మూసీ ప్రాజెక్టు పేరుతో పెద్ద పెద్ద మాటలు చెప్తోన్న రేవంత్‌ రెడ్డి.. మూసీ నది పుట్టే వికారాబాద్‌ అడవుల్లో 12 లక్షల చెట్లు నరికే రాడార్‌ స్టేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నారు. అక్కడ వన మేధం.. హైదరాబాద్‌ లో గృహ మేధం చేస్తున్నారని మండిపడ్డారు. 2017లో రాడార్‌ స్టేషన్‌కు జీవో ఇచ్చినా.. తర్వాత ఇంచు భూమి కూడా మోదీ ప్రభుత్వానికి అప్పగించకుండా అడ్డుకున్నామన్నారు.సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ రూ.7 వేల కోట్లతో, 2,300 కి.మీ.ల పొడవున్న నమామీ గంగే ప్రాజెక్టు రూ.40 వేల కోట్లతో చేపట్టినప్పుడు 56 కి.మీ.ల మూసీ ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు ఎలా ఖర్చవుతాయని ప్రశ్నించారు. అంటే ప్రపంచంలోనే ఇది అన్నింటికన్నా పెద్ద కుంభకోణమని తెలిపారు. ఢిల్లీలో యమున, కోల్‌కతాలో హుబ్లీ, అహ్మదాబాద్‌ లో సబర్మతి నదులు సిటీ మధ్యలోంచే ప్రవహిస్తున్నాయన్న విషయం రేవంత్‌ కు తెలుసో లేదో అని ఎద్దేవా చేశారు. సీఎం చెప్పిన కంపెనీ డైరెక్టర్‌ లపై పాకిస్థాన్‌లో రెడ్‌ కార్నర్‌ నోటీసులు ఇచ్చారని, జార్ఖండ్‌ లో కాంగ్రెస్‌ భాగస్వామ్య జేఎంఎం ప్రభుత్వం ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టిందని తెలిపారు. రూ.141 కోట్లు తీసుకునే కంపెనీ కనీసం నాలుగు ఫొటోలన్నా ఇవ్వదా.. గూగుల్‌ నుంచి ఫొటోలు ఎత్తుకొచ్చి సీఎం ప్రజంటేషన్‌ తయారు చేసిందన్నారు. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీకి, వన్‌ నెస్‌ విగ్రహానికి ఉన్న తేడా కూడా ముఖ్యమంత్రికి తెలియదన్నారు. రేవంత్‌ కు ఏది తెలియదు కాబట్టే నోటికి వచ్చినట్టు వాగి దొరికిపోవడం ఆయన స్పెషాలిటీ అన్నారు. రేవంత్‌ పై కేసులు ఉన్నాయి కాబట్టే మోదీకి భయపడి వికారాబాద్‌ ఫారెస్ట్‌ అప్పగించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీల అమలుకు పైసలు లేవని చెప్తున్నారని, మూసీ ప్రాజెక్టు కట్టేందుకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డితో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని, మూసీతో మురిసె రైతులెందరో, ఎంత ఆయకట్టు సాగులోకి వస్తుంది.. కాస్ట్ బెన్ ఫిట్ రేషియో ఎంతో చెప్పాగలవా? అని ప్రశ్నించారు. సీఎం ప్రజెంటేషన్ చూసిన తర్వాత అది స్కామ్ అని అందరికీ తెలిసిపోయిందన్నారు. మూసీ పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్ లు వస్తే మళ్లీ ఫోర్త్ సిటీ ఎందుకన్నారు. మూసీని వ్యతిరేకిస్తే కసబ్ అని ఆరోపించారని.. కసబ్ టెర్రరిస్ట్ అయితే ఆయన రూ. 50 లక్షలతో దొరికిన వ్యక్తి అని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌ రీ జువెనేషన్‌ అనే పదానికి చూడకుండా స్పెల్లింగ్‌ చెప్తే ఆయనకు రూ.50 లక్షలు పట్టే బ్యాగ్‌ బహుమతిగా ఇస్తానని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వరద బాధితులకు రూ.10 వేల చొప్పున సాయం చేసిందని, ఖమ్మం సహా ఇతర జిల్లాల్లోని వరద బాధితులకు పైసా సాయం చేశారా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉండి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ముఖ్యమంత్రిని ప్రజలు పిచ్చోడు అనుకుంటారని తెలిపారు. తనపై గతంలో రేవంత్‌ అనేక ఆరోపణలు చేశాడని.. వాటిపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి నాలుగు గంటలు నిలబడితేనే మైక్‌ ఇవ్వలేదని గుర్తు చేశారు. అసలు అసెంబ్లీ, కౌన్సిల్‌ పద్ధతి ప్రకారం నడుస్తున్నాయా అని ప్రశ్నించారు. సీఎం మానసిక పరిస్థితి మీద అనుమానాలు ఉన్నాయని, ఆయనను ఆ విధంగా వదిలిపెట్టవద్దని కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చారు.

First Published:  18 Oct 2024 1:06 PM GMT
Next Story