తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు
గతంలో రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్షలు రాసిన నిరుద్యోగులకు ఇది తీవ్ర నిరాశను కలిగించే అంశమే. అయితే పోస్ట్ ల సంఖ్య పెంచి కొత్త ప్రభుత్వం త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది.
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు చేస్తూ TSPSC కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు TSPSC కార్యదర్శి డా. నవీన్ నికోలస్ పేర్కొన్నారు. త్వరలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కాంగ్రెస్ హయాంలో ఇది తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ అవుతుంది.
ఎందుకిలా..?
గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ అది. 2022 ఏప్రిల్ లో 503 పోస్ట్ లతో తొలుత నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిలిమ్స్ పరీక్షల తర్వాత పేపర్ లీకేజీ వార్తలతో ఆ పరీక్ష రద్దయింది. ఆ తర్వాత మళ్లీ ప్రిలిమ్స్ జరిగాయి. కానీ అటెండెన్స్, ఫింగర్ ప్రింట్స్ విషయంలో నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. దీంతో తెలంగాణ హైకోర్టు పరీక్ష రద్దు చేయాలని సూచించింది. కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈలోగా ఇక్కడ ప్రభుత్వం మారిపోయింది. అటు సుప్రీంలో వ్యవహారం ఎటూ తేలకుండా ఉండటంతో.. కాంగ్రెస్ ప్రభుత్వ సూచనలతో TSPSC కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఇప్పుడెలా..?
గతంలో రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్షలు రాసిన నిరుద్యోగులకు ఇది తీవ్ర నిరాశను కలిగించే అంశమే. అయితే పోస్ట్ ల సంఖ్య పెంచి కొత్త ప్రభుత్వం త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. గతంలో టైమ్ పాస్ గా పరీక్ష రాసినవారికి ఇది మరో బంపర్ ఆఫర్. ఈసారి పోస్ట్ ల సంఖ్య కూడా పెరుగుతుంది. సిన్సియర్ గా ప్రిపేర్ అయి పరీక్షలు రాసిన వారికి మాత్రం ఈ నిర్ణయం శరాఘాతం అనే చెప్పాలి. వారంతా మూడోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ రాయాలన్నమాట.