Telugu Global
Telangana

హైదరాబాద్‌కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి: కేటీఆర్

హైదరాబాద్‌లో ఎన్ని ఆకాశహర్మ్యాలు వచ్చినా చార్మినార్ ఒక ఐకానిక్ కట్టడంగా, హైదరాబాద్‌కు గర్వకారణంగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్‌కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి: కేటీఆర్
X

హైదరాబాద్‌కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, చార్మినార్‌ను సక్రమంగా నిర్వహించకుంటే హోదా సాధించడం కష్టంగా మారుతుందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్‌లో ఎన్ని ఆకాశహర్మ్యాలు వచ్చినా చార్మినార్ ఒక ఐకానిక్ కట్టడంగా, హైదరాబాద్‌కు గర్వకారణంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ) పనులపై అసెంబ్లీలో వివరించిన మంత్రి, ఈ పనుల కోసం జీహెచ్‌ఎంసీ రూ.75 కోట్లు, హెచ్‌ఎండీఏ రూ.25 కోట్లు కేటాయించిందన్నారు. అవసరమైతే పనులు వేగవంతం చేసేందుకు హెచ్‌ఎండీఏ నుంచి అదనంగా రూ.50 నుంచి రూ.60 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

“CPP ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. నేను వ్యక్తిగతంగా ఆ ప్రాజెక్ట్ పురోగతిని పర్యవేక్షిస్తున్నాను. మరో ఆరు నెలల్లో మంచి ఫలితాలు వస్తాయి. పాతబస్తీలోనూ మెట్రో పనులు చేపట్టేందుకు రూ.100 కోట్లు కేటాయించాము.'' అని తెలిపారు కేటీఆర్.

పాతబస్తీలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లను జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్‌కు జమ చేసిందని, ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు.

సిపిపి ప్రాజెక్టు లో భాగంగా హాకర్లకు వసతి కల్పించేందుకు మూసీ నదిపై అఫ్జల్‌గంజ్ వద్ద ఐకానిక్ పాదచారుల వంతెనను నిర్మించేందుకు రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆ వంతెన మీద హాకర్లు వ్యాపారాలు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే పనుల నిర్వహణకు టెండర్లు కూడా పిలిచామన్నారు.

ఇదే డిజైన్‌తో మరో పాదచారుల వంతెనను నయాపూల్ సమీపంలో ప్లాన్ చేస్తున్నామని, డిజైన్ ఫైనలైజేషన్ కారణంగా కొంత జాప్యం జరిగిందని ఆయన తెలిపారు.

First Published:  11 Feb 2023 2:41 PM GMT
Next Story