Telugu Global
Telangana

సర్కారు వారి మటన్ క్యాంటీన్..

మటన్‌ క్యాంటీన్‌లో నాణ్యమైన మటన్‌ ఉత్పత్తులు, మటన్‌ బిర్యానీ, కీమా , తలకాయ కూర, మటన్‌ టిక్కా వంటి అన్నిరకాల వెరైటీలు అందుబాటులో ఉంటాయి. సరసమైన ధరలకు వాటిని విక్రయిస్తామంటున్నారు అధికారులు.

సర్కారు వారి మటన్ క్యాంటీన్..
X

తెలంగాణలో ఇటీవల ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన చేపల క్యాంటీన్ కి మంచి ఆదరణ లభించింది. అలాంటి క్యాంటీన్లు జిల్లాల్లో కూడా పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే స్ఫూర్తితో ఇప్పుడు ప్రభుత్వం మటన్ క్యాంటీన్లు కూడా ప్రారంభించబోతోంది. మాసాబ్ ట్యాంక్ లోని షీప్ ఫెడరేషన్ స్టేట్ ఆఫీస్ లో మోడల్ క్యాంటీన్ ని ఈనెల 12న ప్రారంభించబోతున్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మటన్‌, మటన్ బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాలు ఇక్కడ అమ్ముతారు.

ఫిష్ క్యాంటీన్ ని ఫిషరీస్ డిపార్ట్ మెంట్ నిర్వహిస్తోంది. దీనికి మంచి స్పందన వచ్చింది. మటన్ క్యాంటీన్ ని షీప్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. ఇక్కడ పెట్టే క్యాంటీన్ విజయం సాధిస్తే జిల్లా కేంద్రాల్లో కూడా షీప్ ఫెడరేషన్ వీటిని విస్తరిస్తుందని అధికారులు తెలిపారు.

క్యాంటీన్ స్పెషల్..

మటన్‌ క్యాంటీన్‌లో నాణ్యమైన మటన్‌ ఉత్పత్తులు, మటన్‌ బిర్యానీ, కీమా , తలకాయ కూర, మటన్‌ టిక్కా వంటి అన్నిరకాల వెరైటీలు అందుబాటులో ఉంటాయి. సరసమైన ధరలకు వాటిని విక్రయిస్తామంటున్నారు అధికారులు. తెలంగాణలో ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల గొర్రెలు, మేకల సంపద పెరిగింది. ప్రైమరీ బ్రీడర్ సొసైటీల ద్వారా గొర్రెల పెంపకందారులు లాభాలను ఆర్జిస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటు చేయబోయే మటన్ మార్కెట్లకు ప్రైమరీ బ్రీడర్‌ సొసైటీలను అనుసంధానం చేస్తామంటున్నారు అధికారులు. వారే నేరుగా మటన్‌ అమ్ముకునేలా చర్యలు చేపడతామన్నారు.

జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయబోయే మటన్ క్యాంటీన్లలో కురుమ, యాదవ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటున్నారు అధికారులు. పశు సంవర్థక శాఖ, టూరిజం డిపార్ట్ మెంట్.. ఇతర అన్నిరకాల శాఖల సమన్వయంతో ఈ క్యాంటీన్లను విజయవంతంగా నడుపుతామంటున్నారు.

First Published:  5 Sept 2023 7:28 AM IST
Next Story