Telugu Global
Telangana

ఎనిమిది ఇరిగేషన్ సైట్స్ ను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

ఇరిగేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నీటిపారుదల ప్రదేశాలలో ఎనిమిది అతిథి గృహాల నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) ప్రాతిపదికన TSTDCకి అప్పగిస్తారు.

ఎనిమిది ఇరిగేషన్ సైట్స్ ను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
X

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ సైట్స్ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం తొలిదశలో దాదాపు ఎనిమిది ప్రదేశాలను గుర్తించింది. నీటిపారుదల శాఖ, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) లు కలిసి ఈ నీటిపారుదల ప్రదేశాలను అభివృద్ధి చేయనున్నాయి.

ఇరిగేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నీటిపారుదల ప్రదేశాలలో ఎనిమిది అతిథి గృహాల నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) ప్రాతిపదికన TSTDCకి అప్పగిస్తారు.

నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇరిగేషన్) రజత్ కుమార్ ఇటీవల 'ఇరిగేషన్ టూరిజం' ప్రతిపాదనలను అధికారులతో సమీక్షించారు. నీటిపారుదల ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

మొదటి దశలో, TSTDC పెన్ గంగ గెస్ట్ హౌస్, పోచారం గెస్ట్ హౌస్ -I, II, రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్, కోయిల్‌సాగర్ గెస్ట్ హౌస్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్, డిండి రిజర్వాయర్‌లోని గెస్ట్ హౌస్, బాపనికుంటలో గెస్ట్ హౌస్ లను అభివృద్ధి చేస్తుంది. ఈ అతిథి గృహాలకు నాలుగు నుండి 50 ఎకరాల వరకు స్థలముంది. ఈ స్థల‍ంలో పర్యాటకానికి అవసరమైన వివిధ సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు.

ఈ రిజర్వాయర్ల చుట్టుపక్కల కాటేజీల నిర్మాణం, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్, క్రూజింగ్, పారాగ్లైడింగ్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని పర్యాటక అధికారులు యోచిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌లకు రోడ్డు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, ట్రెక్కింగ్ సౌకర్యాలు, రిజర్వాయర్లపై సస్పెన్షన్ వంతెనలు వంటి ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయబోతున్నారు. రిజర్వాయర్ల సమీపంలో హోటళ్లు, రిసార్ట్‌లు, రిక్రియేషన్‌ క్లబ్‌లు, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

సాగునీటి ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించింది.

First Published:  6 March 2023 9:43 AM IST
Next Story