తెలంగాణ ప్రభుత్వం వారిని టార్గెట్ చేస్తుందా..?
రిటైరైన తర్వాత కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తిరిగి విధుల్లో చేరిన వారి వివరాలను అందజేయాలని సీఎస్ శాంతికుమారి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
పదవీ విరమణ తర్వాత కూడా తెలంగాణలో కొంతమంది సీనియర్ల సేవలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి వారిలో కొందరిని ఇంటికి సాగనంపే కార్యక్రమం మొదలు పెట్టింది నూతన కాంగ్రెస్ ప్రభుత్వం. వారి వివరాలు సేకరించాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆ వివరాలు సేకరిస్తున్నారు. రిటైరైన తర్వాత కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తిరిగి విధుల్లో చేరిన వారి వివరాలను అందజేయాలని సీఎస్ శాంతికుమారి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ వివరాలన్నింటినీ బుధవారం సాయంత్రంలోగానే ఇవ్వాలని స్పష్టం చేశారు.
నీటిపారుదల, రోడ్లు-భవనాలు, జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు సహా పలు శాఖల్లో కీలక స్థానాల్లో.. రిటైరైన అధికారులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొందరు ఆయా శాఖలకు అధిపతులుగా కొనసాగుతున్నారు. గతంలోనే కాంగ్రెస్ నేతలు వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. అధికారంలోకి వస్తే అలాంటివారందరి పదవుల విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలరోజులు దాటినా ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు. ఇప్పుడు సడన్ గా సీఎస్ ఆదేశాలివ్వడం విశేషం. అది కూడా ఒకరోజు వ్యవధిలోనే ఆ వివరాలన్నీ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలిచ్చారు.
ఎలాంటి చర్యలు..?
నీటి పారుదల శాఖలో ఇంజినీర్లు, రోడ్లు భవనాల శాఖలో ఇంజినీర్లు, విద్యుత్ శాఖలో డైరెక్టర్లు.. ఇలా కొంతమంది ఇంకా విధులకు హాజరవుతున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత వారి ఉద్యోగాలు సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పుడు ఉన్నతాధికారులు కూడా వారి జాబితా సిద్ధం చేస్తున్నారు కాబట్టి.. ఇక వారిని ఉద్యోగాలనుంచి తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తుందో, ఎంతమందిని తొలగిస్తుందో చూడాలి. అయితే విశ్రాంత అధికారుల విషయంలో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.