ముందుమాట పేజీ చిరిగింది.. ఇద్దరు అధికారులపై వేటు పడింది
ముందుమాట వివాదాన్ని ఎలాగోలా సర్దుబాటు చేసిన ప్రభుత్వం దానికి బాధ్యుల్ని చేస్తూ ఇద్దరు అధికారులపై వేటు వేయడం విశేషం.
పాఠ్యపుస్తకాల్లో ముద్రించే ముందుమాట.. ఏకంగా ఇద్దరు పెద్దస్థాయి అధికారులపై వేటుపడేలా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన ఉదాహరణలు లేవు. కానీ తెలంగాణలో స్కూల్ పిల్లలకు ఇచ్చిన పుస్తకాల్లో ఉన్న ముందుమాట ఇద్దరు ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేష్ కు నూతనంగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ రమణ కుమార్‌కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించారు.
ఎందుకీ వేటు..?
ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభం అయిన రోజునే ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించారు. అయితే తెలుగు పుస్తకాల్లో ముందుమాట విషయంలో పొరపాటు దొర్లింది. గత సీఎం కేసీఆర్, అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పేర్లతో ఆ ముందుమాట అచ్చయింది. ఆ పుస్తకాలను యధాతథంగా పంపిణీ చేయడంతో గొడవ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ అంటూ పుస్తకాల్లో ఉండటంతో సంబంధిత శాఖ మంత్రి చర్యలకు ఆదేశించారు. ఆ తర్వాత పాఠ్యపుస్తకాలను అధికారులు వెనక్కు తీసుకున్నారు. ఓ దశలో ముందుమాట పేజీని చించి దాన్ని వెనకవైపు అట్టకు అంటించాలని ఓ వీడియో సందేశం కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల గ్రూప్స్ లో సర్కులేట్ అయింది. ఈ గందరగోళం మధ్య ఇద్దరు అధికారులపై వేటు పడింది.
తెలుగు పుస్తకంలోని ముందు మాట పేజీలో జరిగిన పొరపాటును ఎలా కవర్ చేయాలో చెప్తున్న అధికారులు https://t.co/7iRs0hAHmd pic.twitter.com/nniYENvOOi
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024
ఈ ముందుమాట విషయంలో బీజేపీ కూడా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. ముందుమాట పేజీ వెనక జాతీయ గీతం ఉందని, ఆ పేజీని చించితే జాతీయ గీతాన్ని కూడా అవమానించినట్టేనని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మొత్తానికి వివాదాన్ని ఎలాగోలా సర్దుబాటు చేసిన ప్రభుత్వం దానికి బాధ్యుల్ని చేస్తూ ఇద్దరు అధికారులపై వేటు వేయడం విశేషం.