Telugu Global
Telangana

ముందుమాట వివాదాస్పదం.. పుస్తకాలన్నీ వెనక్కి

ప్రభుత్వ ఆగ్రహంతో అధికారులు వాటిని వెనక్కి తీసుకుంటున్నారు. ఆ పేపర్ ను తొలగించి, కొత్తగా ముద్రించిన ముందుమాటను పుస్తకాలకు జతచేసి వాటిని తిరిగి పంపిణీ చేస్తారని తెలుస్తోంది.

ముందుమాట వివాదాస్పదం.. పుస్తకాలన్నీ వెనక్కి
X

తెలంగాణలో నిన్నటి(బుధవారం) నుంచి స్కూల్స్ పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తొలిరోజు నుంచే పాఠ్యపుస్తకాల పంపిణీ మొదలైంది. పాఠశాలలు మొదలు పెట్టిన తొలిరోజే పుస్తకాలు పంపిణీ చేశారన్న క్రెడిట్ దక్కుతుందని అధికారులు సంతోషపడ్డారు కానీ, వారి అత్యుత్సాహం చివరకు చీవాట్లు కొనితెచ్చింది. ప్రభుత్వ ఆగ్రహాన్ని వారు చవిచూశారు. కనీస పరిశీలన లేకుండా ఎలా ప్రవర్తించారని నేతలు మండిపడటంతో అధికారులు నష్టనివారణ చర్యలు మొదలు పెట్టారు.

ప్రభుత్వం ప్రచురించి ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల్లో విద్యాశాఖ తరపున ముందుమాట ఉంటుంది. గతేడాది పంపిణీ చేసిన పుస్తకాల్లో అప్పటి సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరుతో ముందుమాట ఉంది. ఈ ఏడాదికి ప్రభుత్వం మారింది, కానీ పుస్తకాల్లో ముందుమాట మాత్రం మారలేదు. ఈ విషయం కొంతమంది పేరెంట్స్ గమనించడంతో ఆ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు వెంటనే పుస్తకాలను వెనక్కి తెప్పించారు.

ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో పుస్తకాల పంపిణీపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష కూడా నిర్వహించింది. పేపర్ బరువు తగ్గించాలని, తద్వారా పుస్తకాల బరువు కూడా తగ్గుతుందని అధికారులకు సూచనలు ఇచ్చారు. దీనివల్ల పేపర్ ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఇంత జరిగినా, కొత్తగా పుస్తకాలు ముద్రించినా.. ముందుమాటను అధికారులెవరూ పట్టించుకోలేదు. దీంతో కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డి సందేశంతో ముందుమాట ఉన్న పుస్తకాలు పంపిణీ అయ్యాయి. ప్రభుత్వ ఆగ్రహంతో అధికారులు వాటిని వెనక్కి తీసుకుంటున్నారు. ఆ పేపర్ ను తొలగించి, కొత్తగా ముద్రించిన ముందుమాటను పుస్తకాలకు జతచేసి వాటిని తిరిగి పంపిణీ చేస్తారని తెలుస్తోంది.

First Published:  13 Jun 2024 7:16 AM GMT
Next Story