Telugu Global
Telangana

చాంద్రాయణగుట్టకు రూ.301 కోట్లు మంజూరు

నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా నిధుల మంజూరు విషయంలో పక్షపాతం ఉండదని మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది. ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

చాంద్రాయణగుట్టకు రూ.301 కోట్లు మంజూరు
X

చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించి పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ కాల్వల పునరుద్ధరణ, పరిహారం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.301 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు మున్సిపల్ శాఖ తరపున నిధుల మంజూరు పత్రాన్ని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి అందజేశారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు.


చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు నిధుల మంజూరు చేయాలంటూ ఇటీవల ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మున్సిపల్ శాఖను కోరారు. వర్షాల సమయంలో ఇప్పుడున్న డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందిగా ఉందని, మురుగు నీరు రోడ్లపైకి వస్తోందని వివరించారు. డ్రైనేజీ కాల్వల సామర్థ్యం సరిపోవడం లేదని చెప్పారు. ఆయన అభ్యర్థన పరిగణలోకి తీసుకుని డీపీఆర్ ప్రకారం నిధులు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 156 కిలోమీటర్ల మేర డ్రైనేజీ కాల్వల నిర్మాణం మరమ్మతుల ప్రక్రియ కోసం 301 కోట్ల రూపాయలు కేటాయించారు. డ్రైనేజీల నిర్మాణం, నిర్వహణ, పరిహారం కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తారు.


నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా నిధుల మంజూరు విషయంలో పక్షపాతం ఉండదని మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది. ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థనను వెంటనే పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.

First Published:  5 Aug 2023 7:45 PM IST
Next Story