Telugu Global
Telangana

తెలంగాణలో ప్రభుత్వ రైస్ మిల్లులు.. జపాన్ సంస్థతో ఒప్పందం

తెలంగాణలో రైస్‌ మిల్లుల సామర్థ్యం 75 లక్షల టన్నులకు మించిలేదు. అయితే ఉత్పత్తి మాత్రం దానికి మించి వస్తోంది. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు అనే వినూత్న ఆలోచన తెరపైకి వచ్చింది.

తెలంగాణలో ప్రభుత్వ రైస్ మిల్లులు.. జపాన్ సంస్థతో ఒప్పందం
X

విత్తనాలు, పెట్టుబడి, సబ్సిడీ ఎరువులు, గిట్టుబాటు ధర వరకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోంది. వరి విషయంలో దళారీలు, రైస్ మిల్లర్ల హవా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. వాటిని పూర్తిగా చెక్ పెట్టి నేరుగా ప్రభుత్వమై రైస్ మిల్లులు నిర్వహిస్తే ఎలా ఉంటుంది..? రైతుకి మరింత లాభం, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కదా..? ఈ ఉద్దేశంతోటే ప్రభుత్వరంగంలో రైస్ మిల్లులకు శ్రీకారం చుడుతున్నారు సీఎం కేసీఆర్. జపాన్ కి చెందిన సటేక్ కార్పొరేషన్ ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు.

ఈ శుక్రవారం దీనిపై మరింత క్లారిటీ వస్తుంది. సటేక్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో శుక్రవారం విస్తృత సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో సటేక్‌ సంస్థ సహకారంతో ఆహార శుద్ధి పరిశ్రమలు, అధునాతన రైస్‌ మిల్లుల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్నమిల్లుల నవీకరణ, తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి, అదే సమావేశంలో ప్రతిపాదనల ఆమోదం కూడా ఉంటుందని తెలుస్తోంది. 2వేలకోట్ల రూపాయలకు పైగా తెలంగాణ ప్రభుత్వం రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ఖర్చు పెట్టబోతోంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే రైస్‌ మిల్లులకు అనుసంధానంగా రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ ఉత్పత్తి చేసే మిల్లులు కూడా ఏర్పాటవుతాయి. ధాన్యం నిల్వల కోసం మరిన్ని గోదాముల్ని ఈ మిల్లులకు అనుసంధానంగా నిర్మిస్తారు. రైతుల పంటకు బహిరంగ మార్కెట్‌ లో అత్యుత్తమ ధర లభించేలా చేయడానికి ధాన్యాన్ని ఇతర ఉత్పత్తులుగా కూడా మారుస్తారు. జిల్లాల వారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లాలో గంటకు 120 టన్నుల ధాన్యాన్ని ఆడించే ఆధునిక సాంకేతికతతో కూడిన రైస్‌ మిల్లులు ఏర్పాటు చేయబోతున్నారు.

ప్రస్తుతం ఏడాదికేడాది తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి పెరుగుతోంది. పంజాబ్ ని సైతం వెనక్కు నెట్టి తెలంగాణ అత్యుత్తమ ఫలితాలు కనబరుస్తోంది. సాగునీటి వనరుల విస్తృతి భారీగా పెరగడంతో ఈ మార్పు వచ్చింది. తెలంగాణలో రైస్‌ మిల్లుల సామర్థ్యం 75 లక్షల టన్నులకు మించిలేదు. అయితే ఉత్పత్తి మాత్రం దానికి మించి వస్తోంది. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు అనే వినూత్న ఆలోచన తెరపైకి వచ్చింది. ఇప్పటికే తెలంగాణ ధాన్యం పలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. తాజాగా కర్నాటక కూడా అధికారికంగా కొనుగోలుకి ఆసక్తి చూపించది. పెరుగుతున్న ఉత్పత్తితో తెలంగాణ అవసరాలకు పోను మిగిలిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ప్రభుత్వమే ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది.

First Published:  20 Jun 2023 6:22 AM IST
Next Story