కేసీఆర్‌కు భద్రత కుదించిన రేవంత్ ప్రభుత్వం
మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి 2+2 గన్‌మెన్లతో భద్రతగా అందించనుంది. మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ల చైర్మన్‌లకు భద్రతను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భద్రతను కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేసీఆర్‌కు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండగా.. ఇకనుంచి వై కేటగిరి భద్రతను ఇవ్వనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖుల సెక్యూరిటీ పైన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ భద్రతను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఉన్న జడ్ ప్లస్ కేటగిరి భద్రతను తొలగించి వై కేటగిరి భద్రత అందించనుంది. వై కేటగిరి భద్రత కింద 4+4 గన్‌మెన్‌లతో పాటు ఇంటిదగ్గర సెంట్రీ పహారా ఉంచనున్నారు. అలాగే కాన్వాయ్‌కి సంబంధించి ఒక వాహనాన్ని ప్రభుత్వం అందించనుంది.
ఇక మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి 2+2 గన్‌మెన్లతో భద్రతగా అందించనుంది. మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ల చైర్మన్‌లకు భద్రతను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. మాజీ ఎమ్మెల్యేల్లో భద్రత అవసరం ఉన్నవారికి, అలాగే ఏజెన్సీ ఏరియాలో ఉండే వారికి మాత్రమే గన్‌మెన్లను ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల మేరకు గన్‌మెన్లను పోలీస్ శాఖ కేటాయించనుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లకు గతంలో ఏ విధంగా భద్రత అందిస్తున్నారో ఇప్పుడు కూడా అదే విధమైన భద్రతను అందించనున్నారు.