Telugu Global
Telangana

హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. సీఎం రేవంత్ నష్టనివారణ చర్యలు

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించామంటున్నారు కాంగ్రెస్ నేతలు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. సీఎం రేవంత్ నష్టనివారణ చర్యలు
X

తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం లేకపోతే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందని, భూముల ధరలు తగ్గిపోతాయని బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే రియల్ ఎస్టేట్ పడకేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న మీడియాలో కూడా రియల్ ఎస్టేట్ రంగంపై వ్యతిరేక వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శల జోరు పెంచింది. తాము చెప్పినట్టుగానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది.

హైదరాబాద్ పరిధిలో, స్థలాలు, పొలాల రేట్లు ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో పెరిగాయనే విషయాలపై గతంలో అంతర్జాతీయ, జాతీయ సంస్థలు అంచనాలు రూపొందించేవి. దాని ఆధారంగానే రియల్ ఎస్టేట్ వ్యవహారంపై ప్రజలు ఓ అంచనాకు వచ్చేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఓ నివేదిక సిద్ధం చేసి విడుదల చేయడం విశేషం. సహజంగా ప్రభుత్వం తన గొప్పలు తానే చెప్పుకుంటుంది. ఈ నివేదికలో కూడా ఇలాగే గణాంకాలతో ఘనత చాటుకుంది.

కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి తర్వాత, 2023 డిసెంబరు నుంచి జూన్‌ నెలాఖరు వరకు 7 నెలల్లో ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4670.52 కోట్ల ఆదాయం వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక సారాంశం. అంతకు ముందు 7 నెలల ఆదాయంతో పోల్చి చూస్తే రూ.241.29 కోట్ల ఆదాయం వృద్ధి చెందిందని తెలిపింది. గతేడాదితో పోల్చి చూస్తే రూ.270.86 కోట్ల మేర ఆదాయం ఎక్కువగా వచ్చిందని తెలిపింది. రిజిస్ట్రేషన్లు కూడా 12శాతం పెరిగాయని అంటున్నారు. భవన నిర్మాణ అనుమతుల్లో 13.17 శాతం పెరుగుదల ఉందని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక చెబుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణ, సికింద్రాబాద్‌ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే రెండు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణంతో రాబోయే రోజుల్లో సిటీ రూపురేఖలు మరింతగా మారిపోతాయని ఆ నివేదికలో తెలిపారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులతో స్థిరాస్తి రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని అంటున్నారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించామంటున్నారు కాంగ్రెస్ నేతలు. గణాంకాలతో సహా వివరించారు. ఈ లెక్కలపై బీఆర్ఎస్ స్పందించాల్సి ఉంది. గతంలో పలు ప్రైవేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ రంగంపై అంచనాలు విడుదల చేస్తుంటే, ఇప్పుడు ప్రభుత్వమే తన ఘనతను చెప్పుకోవడం విశేషం.

First Published:  10 July 2024 8:42 AM IST
Next Story