కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని అందులో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు క్రమబద్ధీకరణ ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం నాడు ఈ కార్యక్రమం చేపట్టారు.
క్రమబద్ధీకరణ ఉత్తర్వుల వివరాలను మంత్రి హరీశ్‌రావు ట్వీట్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని అందులో పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ శుభవార్త. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందరికీ శుభాకాంక్షలు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు.
— Harish Rao Thanneeru (@BRSHarish) April 30, 2023
ఈ ఉత్తర్వుల ద్వారా 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు (ఒకేషనల్), 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్య శాఖలోని 837 మంది మెడికల్ హెల్పర్లు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. క్రమబద్ధీకరణ కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగులంతా సీఎంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.