Telugu Global
Telangana

ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయం.. తెలంగాణ వినూత్న ప్రయోగం

పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించే సమావేశాల సందర్భంలో అక్కడికి వచ్చే ప్రజలు, అధికారులు, సిబ్బంది, తాగునీరు, భోజనాలు చేయడం తదితర అవసరాల కోసం ప్లాస్టిక్‌ వస్తువుల స్థానంలో స్టీల్‌ వస్తువులను వాడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయం.. తెలంగాణ వినూత్న ప్రయోగం
X

అక్కడ ఇక్కడ అని కాదు, అన్ని చోట్లా ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయింది. ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా రకరకాల కారణాలతో వాడలేని పరిస్థితి. పర్యావరణానికి హాని, మన శరీరానికి కూడా హాని అని తెలిసినా కూడా ప్లాస్టిక్ అనివార్యంగా వాడేస్తున్నాం. అయితే ప్రభుత్వాలు కాస్త చొరవ తీసుకుంటే ఈ విషయంలో ప్రజలు కూడా మారే అవకాశముంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది.

స్టీల్ బ్యాంక్..

ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేలా తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో స్టీల్‌ బ్యాంకును ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 170మండలాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఇక్కడ భోజనానికి సంబంధించిన అన్నిరకాల స్టీల్ పాత్రలు అందుబాటులో ఉంటాయి.

ఏంటి ఉపయోగం..?

అధికారిక కార్యక్రమాలు జరిగే సమయంలో టిఫిన్లు, భోజనాలు పెట్టడం సహజం. అయితే ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహార పదార్ధాల వడ్డన ఉంటుంది. డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాస్ లు, కప్ లు, వాటర్ బాటిల్స్... ఇలా అన్నీ ప్లాస్టిక్ వే వాడుతుంటారు. వాటి బదులు స్టీల్ పాత్రల వాడకాన్ని ప్రోత్సహించడానికే స్టీల్ బ్యాంక్ లు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలో ఎక్కడ ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ఈ స్టీల్ బ్యాంక్ నుంచి పాత్రల్ని తీసుకెళ్తారు, తిరిగి మళ్లీ అక్కడికే తెచ్చి ఇచ్చి వెళ్తారు. ఇలా ఇది ఒక అలవాటుగా మారి ప్లాస్టిక్ ని పూర్తిగా దూరం పెట్టే రోజు వస్తుందనేది అధికారుల ఆలోచన.

ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని మొత్తం పంచాయతీల్లో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రయోగాన్ని అమలులో పెడుతున్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు ఉన్న అన్ని అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నారు నేతలు, అధికారులు. పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించే సమావేశాల సందర్భంలో అక్కడికి వచ్చే ప్రజలు, అధికారులు, సిబ్బంది, తాగునీరు, భోజనాలు చేయడం తదితర అవసరాల కోసం ప్లాస్టిక్‌ వస్తువుల స్థానంలో స్టీల్‌ వస్తువులను వాడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

సిద్ధిపేట జిల్లాలో ఉన్న 23 మండలాల్లోని 499 పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్‌ బ్యాంక్‌ లు ఏర్పాటు చేశారు. నల్గొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పంచాయతీల్లో స్టీల్ బ్యాంక్ లను అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా ప్లాస్టిక్ వాడకం క్రమక్రమంగా తగ్గిపోతోందని అంటున్నారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పద్ధతి అమలులోకి వస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం భారీగా తగ్గుతుందని.. సామాన్య ప్రజల్లో కూడా అవగాహన తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు.

First Published:  23 May 2023 1:36 PM IST
Next Story