మంత్రి పదవి లేదు.. సలహాదారుగా సరిపెట్టుకోండి
ప్రస్తుతం ముగ్గురు సలహాదారులకు కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మరో సీనియర్ నేత మల్లు రవి నియమితులయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్తగా ముగ్గురు సలహాదారులు నియమితులయ్యారు. ఈ లిస్ట్ లో మంత్రి పదవి రేసులో ఉన్న షబ్బీర్ అలీ పేరు కూాడా ఉండటం గమనార్హం. షబ్బీర్ అలీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. వాస్తవానికి ఆయన కామారెడ్డి నుంచి కేసీఆర్ కి పోటీగా బరిలో దిగాల్సి ఉన్నా.. ఆ స్థానంలో రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో పక్కకు తప్పుకున్నారు. కాంగ్రెస్ గెలిచాక షబ్బీర్ అలీకి కచ్చితంగా మంత్రి పదవి ఉంటుందని అనుకున్నారంతా. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి, ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తారనే అంచనాలున్నాయి. కానీ ఆ లిస్ట్ లో షబ్బీర్ అలీ పేరు లేదు. తాజాగా ఆయన్ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. షబ్బీర్ అలీతోపాటు వేం నరేందర్ రెడ్డి, హరకర వేణుగోపాల్ కి కూడా సలహాదారు పోస్ట్ లు లభించాయి.
కేబినెట్ హోదాతో..
ప్రస్తుతం ముగ్గురు సలహాదారులకు కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు. వీరందరూ మంత్రివర్గానికి సలహాదారులుగా పనిచేస్తారు. హరకార వేణుగోపాల్.. ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ వ్యవహారాల్లో సలహాలిస్తారు. వేం నరేందర్ రెడ్డి.. సీఎం వ్యవహారాలు చూస్తారు. షబ్బీర్ అలీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మరో సీనియర్ నేత మల్లు రవి నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
రేవంత్ తో వేం నరేందర్ రెడ్డిది ప్రత్యేక బంధం..
ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డితో, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో వీరిద్దరూ టీడీపీలో ఉన్నారు, తర్వాత కలిసే కాంగ్రెస్ లోకి వచ్చారు. గతంలో టీడీపీలో ఉండగా వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసమే రేవంత్ రెడ్డి.. స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లారని అంటారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు వేం నరేందర్. సీఎం సన్నిహితుడు కావడంతో ఆయనకు సలహాదారు పదవి లభించింది. హరకర వేణుగోపాల్ కూడా కాంగ్రెస్ లో సీనియర్ నేత. ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. మంత్రి పదవులు కాకపోయినా.. కేబినెట్ ర్యాంకులతో ఆ ముగ్గురికి కీలక పదవులు అప్పగించింది కాంగ్రెస్.