Telugu Global
Telangana

వాళ్లు చేయలేదు, నేను చేస్తున్నా.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ఉన్న స్మృతి వనం సుందరీకరణ, అభివృద్ధికి ఒక ఎకరం భూమి కేటాయింపుకి సంబంధించిన జీఓను ప్రభుత్వం జారీ చేసింది. అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

వాళ్లు చేయలేదు, నేను చేస్తున్నా.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు
X

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరోజే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం చేయలేని పనులు తాను చేసి చూపిస్తున్నాను అనేలా.. ఆయన నిర్ణయాలున్నాయి. గత ప్రభుత్వం పట్టించుకోకపోయినా, కాంగ్రెస్ హయాంలో ఆయా పనులు జరుగుతున్నాయని ప్రజలు గుర్తించేలా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ ముందున్న గేట్లు తొలగించి ప్రజా భవన్ గా పేరు మార్చడం కూడా ఇందులో భాగమే. తాజాగా ప్రొఫెసర్ జయశంకర్ సొంత గ్రామానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా మార్చారు.


వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రకటన జీఓ నెంబర్ 405ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం అక్కంపేట, పెద్దాపూర్ గ్రామంలో భాగంగా ఉంది.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి గ్రామం-బి లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ఉన్న స్మృతి వనం సుందరీకరణ, అభివృద్ధికి ఒక ఎకరం భూమి కేటాయింపుకి సంబంధించిన జీఓను ప్రభుత్వం జారీ చేసింది. అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

తెలంగాణ పోరాటం పట్ల, తెలంగాణకోసం పోరాటం చేసినవారి పట్ల, అమర వీరుల త్యాగాల పట్ల తమకు చిత్తశుద్ధి ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. సీఎం తొలి ప్రసంగంలో జై తెలంగాణ అని నినదించలేదు అనే విమర్శలు వినిపించాయి. వాటన్నిటికీ తన చేతలతో సమాధానం చెప్పాలనుకుంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సొంత ఊరుని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, అక్కంపేట.. కాంగ్రెస్ హయాంలో రెవెన్యూ గ్రామంగా మారిందని చెప్పబోతున్నారు. అమరవీరుల స్మృతివనంపై కూడా తమకు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకునేలా జీఓ విడుదల చేశారు.

First Published:  8 Dec 2023 2:33 AM GMT
Next Story